Indian Women’s Team | భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా వెటరన్ క్రికెటర్ అమోల్ మజుందార్ నియామకం దాదాపు ఖరారైంది. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ముంబయిలో సోమవారం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. సీఏసీ సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ ప్రాంజ్పే, సులక్షణ నాయక్ మంజుందార్ వైపు మొగ్గు చూపారు. ఆయనతో పాటు జాన్ లూయిస్, తుషార్ అరోథే పోటీపడ్డారు.
అరోథే గతంలో మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేశారు. 2018లో పదవికి రాజీనామా చేశారు.
భారత మహిళల జట్టు ఈ నెలలో బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. అంతకంటే ముందే టీమిండియా కోచ్‌ని నియమించాలని బీసీసీఐ భావిస్తున్నది. గతేడాది డిసెంబర్లో రమేశ్ పవార్‌ను ప్రధాన కోచ్ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి హెడ్‌కోచ్ పోస్టు ఖాళీగా ఉన్నది. మజుందార్ భారత్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. కానీ, దేశవాళీ క్రికెట్లో 14వేలకుపైగా పరుగులు చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐ అధికారి మాట్లాడుతూ అమోల్ ప్రెజెంటేషన్ సీఏసీ సభ్యులను ఆకట్టుకుందని చెప్పారు. తన ప్రణాళికలపై స్పష్టంగా వివరించాడని తెలిపారు. ప్రస్తుతం మజుందార్ ముంబయి రంజీ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్, దక్షిణాఫ్రికా జాతీయ జట్టుతో కలిసి పనిచేశారు. భారత మహిళల జట్టు బంగ్లాదేశ్‌లో త్వరలో పర్యటించనున్నది. మిర్పూర్లో మూడు టీ20, వన్డేలు ఆడనున్నది.
మంజుందార్ను రెండేళ్లు హెడ్‌కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే ప్రపంచకప్ టైటిల్ కోసం భారత జట్టును నడిపిస్తాడని భావిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్‌లో బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. ఈ ఏడాది ప్రారంభంలో టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్స్‌లో టీమిండియా గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ ఓటమిపాలైంది. మహిళా క్రికెటర్ల ఫిట్నెస్ను మెరుగుపరచడంతో పాటు వివిధ అంశాలపై మంజుదార్ దృష్టి సారిస్తాడని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఫిట్నెస్, మెంటల్ ట్రైనర్, ఇతర సహాయక సిబ్బంది ఆవశ్యకతను నొక్కి చెప్పాడని పేర్కొన్నారు. భారత ఉపఖండంలో వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరుగనుండగా.. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆథిత్యం ఇవ్వనున్నది.
ఇక మంజుందార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 171 మ్యాచ్‌ల్లో 48.13 సగటుతో 11,167 పరుగులు చేశాడు. అదే సమయంలో లిస్ట్-ఎలో అతను 113 మ్యాచ్‌ల్లో 38.20 సగటుతో 3,286 పరుగులు చేశాడు. మజుందార్ 14 టీ20 మ్యాచ్‌ల్లో 174 పరుగులు సాధించాడు. ఇన్ని పరుగులు చేసినప్పటికీ భారత జట్టులో స్థానాన్ని సాధించలేకపోయాడు. మజుందార్ ఫస్ట్ క్లాస్‌లో 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు, లిస్ట్-ఎలో మూడు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు, టీ20లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు.