రూర్కెలా: సొంతగడ్డపై జరుగుతున్న హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గ్రూప్-‘డి’లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి పోరులో భారత్ 2-0తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. అటాకింగ్‌కు మారుపేరైన స్పెయిన్‌ను డిఫెన్స్‌కు పరిమితం చేస్తూ.. బిర్సా ముండా స్టేడియంలో మనవాళ్లు వీరంగమాడారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. భారత్ తరఫున అమిత్ రొహిదాస్ (12వ నిమిషంలో), హార్దిక్ సింగ్ (26వ ని.లో) చెరో గోల్ చేశారు. అమిత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిస్తే.. హార్దిక్ సింగ్ ప్రత్యర్థి ఆటగాళ్లను చాకచక్యంగా బోల్తా కొట్టిస్తూ ఫీల్డ్‌గోల్ నమోదు చేశాడు. భారత హాకీ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ప్లేయర్లకు చెరో పది లక్షలు నజరానా అందించగా.. సీఎం ప్రోత్సాహంతో లోకల్‌బాయ్ అమిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 5-0తో వేల్స్‌పై, ఆస్ట్రేలియా 8-0తో ఫ్రాన్స్‌పై, అర్జెంటీనా 1-0తో దక్షిణాఫ్రికాపై విజయాలు సాధించాయి.