సిడ్నీ: బీడబ్ల్యూఎఫ్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత సింగిల్స్ ఆటగాళ్లు తొలి రౌండ్లో శుభారంభం చేశారు. హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి, స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్‌తో పాటు మరో ముగ్గురు ప్రిక్వార్టర్స్‌కు ముందంజ వేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో తరుణ్.. 21-13, 17-21, 21-19తో మాగ్నస్ జొహన్నెసెన్ (డెన్మార్క్)పై నెగ్గాడు. లక్ష్యసేన్.. 21-17, 21-13తో చైనీస్ తైఫీకి చెందిన సు లీ యాంగ్‌పై గెలిచాడు. 2023లో ఈ టోర్నీ రన్నరప్‌గా నిలిచిన ప్రణయ్.. 6-21, 21-12, 21-17తో యొహేన్స్ సాట్ మార్సెల్లినొ (ఇండోనేషియా)పై పోరాడి విజయం సాధించాడు. కర్నాటక కుర్రాడు అయూశ్ శెట్టి.. 21-11, 21-15తో సామ్ యువన్ (కెనడా)ను చిత్తుచేశాడు. సీనియర్ కిదాంబి శ్రీకాంత్ 21-19, 19-21, 21-15తో ప్రపంచ 20వ ర్యాంకర్ లీ చియా హావొ (చైనీస్ తైఫీ)కు షాకిచ్చాడు. కానీ కిరణ్ జార్జి.. 21-11, 22-24, 17-21తో కెంటా నిషిమొటొ (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు.