క్లెర్మాంట్-ఫెరాండ్(ఫ్రాన్స్): స్వీడన్ పోల్‌వాల్ట్ దిగ్గజం అర్మాండ్ డుప్లాంటిస్ మరోమారు ప్రపంచ రికార్డుతో సత్తాచాటాడు. పోల్‌వాల్ట్‌లో తనకు తిరుగులేదని చాటిచెబుతూ వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ టూర్ టోర్నీలో డుప్లాంటిస్ 6.27మీటర్ల ఎత్తు ఎగిరి కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ, ఒలింపిక్స్ చాంపియన్ అయిన డుప్లాంటిస్..పోల్‌వాల్ట్‌లో ఏకంగా 11వ సారి ప్రపంచ రికార్డును సవరించుకోవడం విశేషం.
తన తొలి ప్రయత్నంలోనే 6.27మీటర్లు ఎగిరిన ఈ దిగ్గజం ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచాడు. ఎమాన్యుయల్ కరాలిస్(6.02మీ) రెండో స్థానంలో నిలువగా, మరో ఆరుగురు 5.91మీటర్లకే పరిమితమయ్యారు.