49 పరుగుల తేడాతో ట్రైల్బ్లేజర్స్ చిత్తు
మహిళల టీ20 చాలెంజ్
పుణె: సమిష్టి ప్రదర్శనతో సూపర్ నోవాస్ మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో శుభారంభం చేసింది. డిఫెండింగ్ చాంపియన్ ట్రైల్బ్లేజర్స్ను 49 పరుగుల తేడాతో చిత్తు చేసింది. పుణె వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (37: 4 ఫోర్లు) రాణించగా.. హర్లిన్ డియోల్ (35: 5 ఫోర్లు), డియేండ్ర డాటిన్ (32: 5 ఫోర్లు, ఒక సిక్సర్), ప్రియా పునియా (22) తలా కొన్ని పరుగులు చేశారు.
బ్లేజర్స్ బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఛేదనకు దిగిన ట్రైల్బ్లేజర్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 114 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ స్మృతి మందన (34) రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ (24), హేలీ (18), రేణుక సింగ్ (14 నాటౌట్) స్వల్ప స్కోరుకు పరిమితమయ్యారు. హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డితోపాటు షర్మిన్ అక్తర్, సల్మా ఖాతూన్ డకౌట్ కాగా.. సోఫియా డంక్లీ ఒక పరుగుకే పరిమితమైంది. సూపర్ నోవాస్ బౌలర్లలో పూజా వస్ర్తాకర్ 4 వికెట్లు పడగొట్టగా.. సోఫీ, అలానా కింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. ట్రైల్బ్లేజర్స్ను చావుదెబ్బ తీసిన పూజా వస్ర్తాకర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయోత్సాహంతో మంగళవారం వెలాసిటీతో సూపర్నోవాస్ అమీతుమీ తేల్చుకోనుంది.