ముంబై: ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ అనంతరం పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను భారత జట్టు వన్డే కెప్టెన్‌గా చూడొచ్చని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా భారత జట్టును గెలిపిస్తే.. అతడిని భావి కెప్టెన్‌గా భావించొచ్చని సన్నీ అన్నాడు. వాంఖడే వేదికగా శుక్రవారం జరుగనున్న తొలి వన్డేకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండటం లేదు.
దీంతో పాండ్యా జట్టు కు నాయకత్వం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో సన్నీ మాట్లాడుతూ.. ‘టీ20ల్లో పాండ్యా కెప్టెన్సీ ఆకట్టుకుంది. ఐపీఎల్లో అతడు గుజరాత్‌కు టైటిల్ అందించాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో పాండ్యా టీమిండియాను గెలిపిస్తే.. అతడిని భావి వన్డే కెప్టెన్‌గా చూడొచ్చు. బాధ్యతలు తీసుకోవడంలో అతడు ముందుంటాడు’ అని అన్నాడు.