Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో దుమ్మురేపుతున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో శతకాల మోత మోగించిన అతను ఈ లీగ్‌లో వరుస శతకాలతో చెలరేగి ఆడుతున్నాడు. సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మిత్ శనివారం సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం బాదాడు. 66 బంతుల్లోనే 125 రన్స్ స్కోర్ చేశాడు. ఈ లీగ్‌లో స్మిత్‌కు ఇది రెండో శతకం. అంతేకాదు టీ20ల్లో అతనికి అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా. పోయిన మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్పై అతను విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఈ లీగ్‌లో తొలి శతకం కొట్టాడు. 56 బంతుల్లోనే వంద మార్క్ అందుకున్నాడు.
స్మిత్ శతకంతో చెలరేగడంతో సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్ 62 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 125 పరుగుల తేడాతో గెలుపొందింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్మిత్ సెంచరీలతో మెరిశాడు. బిగ్‌బాష్ లీగ్‌లోనూ అతను అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.