హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెల్జియం వేదికగా జరిగిన జింపియాస్ జిమ్నోవకప్ అర్టిస్టిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ జిమ్నాస్ట్ నిష్క అగర్వాల్ కాంస్య పతకంతో మెరిసింది. శనివారం జరిగిన బాలికల సీనియర్ టేబుల్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో నిష్క 12.81 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది.
ఇదే విభాగంలో మార్యమ్ సాబెర్(కెనడా, 12.93), సమీరా రఫీన్(స్విట్జర్లాండ్, 12.91) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. మొత్తం 14 దేశాలకు చెందిన జిమ్నాస్ట్లు పాల్గొన్న టోర్నీలో పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్గా నిష్క నిలిచింది. ప్రస్తుతం నగరంలోని గాడియం స్పోర్టోపియాలో శిక్షణ తీసుకుంటున్న నిష్క జిమ్నాస్టిక్స్లో నిలకడగా రాణిస్తున్నది.