Srilanka Cricket : ప్రపంచ క్రికెట్లో వారసత్వం కొత్తేమీ కాదు. తమ తండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ అంతర్జాతీయ క్రికెట్లో మెరిసిన కుర్రాళ్లు చాలామందే. ఇప్పుడు శ్రీలంక నుంచి మరోతరం రాకెట్లా దూసుకొస్తోంది. ఆ దేశ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్ (Muthaiah Muralidaran), సన్ జయసూర్య (Sanath Jayasuriya) కుమారులు క్లబ్ క్రికెట్లో తలపడుతున్నారు. ‘ఎస్ఎస్సీ’ క్లబ్‌కు జయసూర్య తనయుడు రనుక్ జయసూర్య, ‘తమిళ్ యూనియన్’ (Tamil Union) జట్టుకు నరేన్ మురళీధరన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో.. లెజెండరీ ఆటగాళ్ల వారసుల పోరును చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
శ్రీలంక క్రికెట్‌కు విశేష సేవలందించిన జయసూర్య, మురళీధరన్ ఇద్దరూ ఇద్దరే. ఒకరేమో విధ్వంసక ఓపెనర్‌గా చెలరేగి ఆడితే.. మరొకరు బంతితో మ్యాజిక్ చేశారు. సుదీర్ఘ కాలం జట్టు విజయాల్లో కీలకమైన ఈ ఇద్దరూ రిటైర్మెంట్ తర్వాత తమ వారసులను తీర్చిదిద్దే పనిలో విజయవంతం అయ్యారు.
Ranuk Jayasuriya and Naren Muralidaran, sons of Sanath Jayasuriya and Muttiah Muralidaran, feature in the SSC vs Tamil Union U-23 clash 🏏 A new generation of cricketing legacy in action! pic.twitter.com/iD0YAeOLXt
— NewsWire 🇱🇰 (@NewsWireLK) August 23, 2025
‘పీ.సారా ఓవల్ మైదానంలో ఈరోజు ముఖ్యమైన క్లబ్ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఎస్ఎస్సీ, తమిళ్ యూనియన్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఎస్ఎస్సీ జట్టుకు వెటరన్ జయసూర్య కుమారుడు రనుక్, తమిళ్ యూనియన్ టీమ్‌కు మురళీధన్ కొడుకు నరేన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు దిగ్గజాల వారసులు మైదానంలో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు’ అని ఎక్స్ పోస్ట్‌లో ఒక యూజర్ వెల్లడించాడు.
స్పిన్ లెజెండ్ మురళీధరన్ కుమారుడైన నరేన్ నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. టీ20ల్లో 11 పరుగులు చేసి రెండు వికెట్లు తీశాడు. కానీ, అతడి తండ్రి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా చరిత్ర సృష్టించాడు. మిస్టరీ బౌలింగ్‌తో బ్యాటర్లను వణికించిన ముత్తయ్య.. వన్డేల్లో 534 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 800 వికెట్లతో ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడీ వెటరన్. జయసూర్య కుమారుడు రనుక్ ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్నాడు. అతడి తండ్రి జయసూర్య వన్డేల్లో 13,430 రన్స్.. టెస్టుల్లో 6,973 పరుగులు సాధించాడు. ఆల్‌రౌండర్ అయిన అతడు వన్డేల్లో 323 వికెట్లు, టెస్టుల్లో 98 వికెట్లు పడగొట్టాడు.