T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ శ్రీలంక బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో కప్ కొట్టాలనే కసితో ఉన్న లంక ఫీల్డింగ్ కోచ్‌గా భారత మాజీ కోచ్ ఆర్ శ్రీధర్ (R Sridhar)ను నియమించింది. వరల్డ్‌కప్ టోర్నీ ముగిసేంత వరకూ అతడు ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. టీమిండియాకు కోచ్‌గా ఏడేళ్లు సేవలందించిన శ్రీధర్ ఇప్పుడు లంక క్రికెటర్లకు మెలకువలు నేర్పే పనిలో బిజీ కానున్నాడు.
పొట్టి ప్రపంచకప్ కోసం ఆతిథ్య శ్రీలంక పక్కాగా సిద్ధమవుతోంది. భారత్‌తో కలిసి ఈ మెగా టోర్నీ నిర్వహించనున్న లంక.. ఆటగాళ్ల ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచడం కోసం టీమిండియా మాజీ కోచ్ ఆర్ శ్రీధర్‌ను సంప్రదించింది. ఫీల్డింగ్ కోచ్‌గా సుదీర్ఘ అనుభవమున్న అతడిని ప్రపంచకప్ ముగిసేంత వరకూ కోచ్‌గా ఉండాలని కోరింది. లంక క్రికెట్ తనను కోచ్‌గా నియమించడంపై శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశాడు.
🚨 Sri Lanka have appointed R Sridhar as their fielding coach until the end of next year’s Men’s T20 World Cup.
Sridhar was India’s fielding coach for a long, successful tenure between 2014 and 2021 💪 pic.twitter.com/5mrd48Tkny
— Cricbuzz (@cricbuzz) December 17, 2025
శ్రీలంక క్రికెటర్లు ఎంతో ప్రతిభావంతులు. అందరూ సమిష్టితత్వంతో పోరాడుతారు. ఫీల్డింగ్ కోచ్‌గా నా పాత్ర కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం కాదు. కానీ, ఆటగాళ్లలో అథ్లెటిజం, అవగాహన అనేవి.. సహజంగా పెరుగుతాయి. చురుకైన చేతులు, మెరుపు కదలికలు, భయం లేకుండా ఉండడం వంటివి క్రమంగా మెరుగవుతాయి అని శ్రీధర్ పేర్కొన్నాడు. త్వరలో పాకిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌తో లంక కోచ్‌గా శ్రీధర్ ప్రయాణం మొదలవ్వనుంది.
బీసీసీఐ లెవల్ 3 క్వాలిఫైడ్ కోచ్ అయిన శ్రీధర్ 2014 నుంచి 2021 వరకూ భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఈమధ్యే అతడు అఫ్గనిస్థాన్ జట్టుకు కన్సల్టంట్ కోచ్‌గా వ్యవహరించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మరుసటి రోజే ఐర్లాండ్‌తో శ్రీలంక తలపడనుంది.