హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీని తయారుచేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్న విధానాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.