Sourav Ganguly | చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి విరుచుకుపడ్డాడు. మహ్మద్ షమీని జాతీయ జట్టులోకి తీసుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోని బెంగాల్ తరఫున షమీ అద్భుతంగా రాణించాడు. డొమెస్టిక్ క్రికెట్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నా.. జాతీయ జట్టు నుంచి పిలుపు అందలేదు. సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీలో చివరి మూడు మ్యాచుల్లో కలిపి 11 వికెట్లు తీసి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. గత కొంతకాలంగా షమీ-అగార్కర్ మధ్య విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది.
ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు షమీని ఎంపిక చేయకపోవడంతో అగార్కర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా గంగూలీ సైతం అగార్కర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాడు. సెలెక్టర్లు గమనిస్తున్నారన్న విషయం తనకు తెలుసునన్నారు. ఈ విషయంలో మహ్మద్ షమీ, సెలెక్టర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయని తనకు తెలుసునన్నారు. షమీ ఫిట్నెస్, నైపుణ్యం అందరికీ తెలిసిందేనన్నారు. భారత్ తరఫున టెస్ట్ మ్యాచులు, వన్డేలు, టీ20 ఆడలేకపోవడానికి తనకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. అతనికి అపారమైన నైపుణ్యం ఉందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపాడు. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత షమీ చీలమండ గాయంతో బాధపడ్డాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నీకి షమీ దూరమయ్యాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో షమీ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో చోటు కల్పించకపోవడంతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ అద్భుతంగా రాణించాడు. పుదుచ్చేరిపై బెంగాల్ తరఫున 3/34 వికెట్లు తీసిన భారత పేసర్.. హైదరాబాద్‌లో రెండుసార్లు నాలుగు వికెట్లు సాధించాడు. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లు 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. సర్వీసెస్‌పై 13 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. కేవలం మూడు మ్యాచుల్లోనే 11 వికెట్లు తీశాడు.