Sourav Ganguly | భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తొలిసారిగా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తన కెరియర్లోనే కొత్ అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు పరిపాలనపరమైన పాత్రల్లో కొనసాగిన గంగూలీ.. ఓ జట్టుగా హెడ్‌కోచ్‌గా పని చేయనున్నారు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2026 సీజన్ కోసం ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు గంగూలీని హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు పిట్రోరియా క్యాపిటల్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే SA20 నాల్గవ సీజన్ కోసం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రిటోరియా క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా నియామకమయ్యారని పేర్కొంది. మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ స్థానంలో గంగూలీ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రొఫెషనల్ క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా గంగూలీ పూర్తి స్థాయి పాత్ర పోషించడం ఇదే మొదటిసారి. 53 ఏళ్ల గంగూలీ గత సంవత్సరం నుంచి ప్రిటోరియా క్యాపిటల్స్ మాతృ సంస్థ అయిన జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌కు క్రికెట్ డైరెక్టర్ పని చేసిన విషయం తెలిసిందే.
భారత మాజీ కెప్టెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్రికెట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ సందర్భంగా ప్రిటోరియా క్యాపిటల్స్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘యువరాజు మా క్యాంప్‌కు రాజసం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు! సౌరవ్ గంగూలీని మా కొత్త హెడ్ కోచ్‌గా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం’ పేర్కొంది. వాస్తవానికి గంగూలీ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత క్రికెట్ పరిపాలన రంగంలోనే ఎక్కువగా పని చేసేందుకు ఆసక్తి చూపించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతల్లో కొనసాగారు. ప్రస్తుతం ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్‌గానూ కొనసాగుతున్నారు.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, అలాగే ఒక దశలో మెంటార్‌గా వ్యవహరించారు. గత సీజన్ వరకు జొనాథన్ ట్రాట్ ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా ఉన్నారు. గత సీజన్లో ఆ జట్టు పది గ్రూప్ మ్యాచ్‌లలో కేవలం రెండింట్లోనే విజయం సాధించింది. నాకౌట్ దశకు చేరుకోకపోవడంతో ట్రాట్ హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే గంగూలీ హెడ్‌కోచ్‌గా తీసుకోవడం విశేషం. సెప్టెంబర్ 9న జరిగే ఆటగాళ్ల వేలం జరుగనున్నది. జట్టును అన్నిరంగాల్లో తీర్చిదిద్దేందుకు ఉత్తమమైన ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత గంగూలీపైనే ఉండనున్నది. 2026 పురుషుల టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని దక్షిణాఫ్రికా టీ20 లీగ్ షెడ్యూల్‌ను ముందస్తుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ లీగ్ డిసెంబర్ 26న మొదలై వచ్చే ఏడాది జనవరి 25 వరకు కొనసాగుతుంది. గంగూలీ నియామకం తమ అదృష్టంలో మార్పు తెస్తుందని ప్రిటోరియా క్యాపిటల్స్ ఆశిస్తోంది.