ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం మంగళవారం వేలంపాట ఆసక్తికరంగా సాగింది. మొత్తం ఏడు ఫ్రాంచైజీలు పలువురు ప్లేయర్ల కోసం పోటీపడ్డాయి. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్‌ను పీబీజీ పుణె జాగ్వర్స్ టీమ్ రూ.12 లక్షలకు సొంతం చేసుకుంది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ స్నేహిత్ ఇటీవల కాలంలో వరుసగా టైటిళ్లు సాధిస్తున్నాడు. పుణె టీమ్‌లో స్నేహిత్‌తో పాటు స్టార్ ప్యాడ్లర్ దివ్యా చితాలె చోటు దక్కించుకుంది. వరుసగా రెండో ఏడాది రూ.37.40 లక్షలతో దివ్య ఎక్కువ ధర పలికిన భారత ప్లేయర్‌గా నిలిచింది. వీరికి తోడు ప్రతికా పావ్డె, ఒమర్ అస్సర్, ముదిత్ దాని, సయానికా మాజీతో పుణె టీమ్ బలంగా కనిపిస్తున్నది. వేలంలో ఓవరాల్‌గా రొమేనియాకు చెందిన బెర్నాడెటె చాక్స్ అత్యధికంగా రూ.40 లక్షలకు డెంపో గోవా చాలెంజర్స్ టీమ్ కొనుగోలు చేసింది. ఈసారి లీగ్‌లో మొత్తం ఏడు జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీపడుతాయి. ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో ఒక్కోసారి తలపడుతుంది. టాప్-4లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.