హైదరాబాద్: తెలంగాణ యువ షూటర్ తనిష్క్ మురళీధర్ నాయుడు(Shooter Tanishq Naidu) టాప్ షూటర్‌గా ఎదుగుతున్నాడు. ఈ హైదరాబాదీ క్రీడాకారుడు తాజాగా ముగిసిన ఆసియా జూనియర్స్ షూటంగ్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించాడు. ఒలింపిక్స్‌లో పతకమే టార్గెట్‌గా తనిష్క్ తన ట్యాలెంట్‌కు పదును పెడుతున్నాడు. కజకిస్తాన్‌లోని షిమ్కెంట్లో జరిగిన ఆసియా షూటింగ్ పోటీల్లో అతను 25 మీటర్ల స్టాండర్డ్ పిస్తోల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు సాధించాడు. గత రెండేళ్ల నుంచి టాప్ ఫామ్‌లో ఉన్న ఆ షూటర్ ఇప్పుడు ఒలింపిక్స్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం జూనియర్ స్థాయిలో ఆడుతున్న అతను.. త్వరలోనే సీనియర్స్ కేటగిరీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
హైదరాబాద్‌లో ఉన్న ఒలింపిక్ షూటర్ గగన్‌నారంగ్ అకాడమీలో తనిష్క్ శిక్షణ పొందుతున్నాడు. గన్ ఫర్ గ్లోరీ అకాడమీ నుంచి తనిష్క్ రాటుదేలుతున్నాడు. ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడమే కాదు.. ఆ మెగా ఈవెంట్లో దేశానికి పతకాన్ని తీసుకురావాలన్న కాంక్షతో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తనిష్క్ చెప్పాడు. నమస్తే తెలంగాణతో మాట్లాడిన తనిష్క్.. ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్‌షిప్ ఫలితంపై సంతోషం వ్యక్తం చేశాడు. తన ప్లానింగ్, ప్రిపరేషన్ గురించి అతను వెల్లడించాడు. చాలా నిలకడగా, ఫోకస్డ్గా షూటింగ్ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నట్లు తనిష్క్ తెలిపాడు.
ఖేలో ఇండియా, ప్రాజెక్టు లీప్ ప్రస్తుతం స్పాన్సర్షిప్ కల్పిస్తున్నాయన్నాడు. మునుముందు మరింత ప్రోత్సాహం లభిస్తే, షూటింగ్ ఫీల్డ్‌లో మరిన్ని పతకాలు గెలవడం ఖాయమని తనిష్క్ చెప్పాడు. తనిష్క్ తండ్రి శ్రీనివాస్ రావు. ఆయన భారతీయ నౌకాదళంలో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రక్షణశాఖకు చెందిన డిజైన్ ఇంజినీర్ శాఖలో పనిచేస్తున్నారు. షూటర్ తనిష్క్ తల్లి అనురాధ. ఆమె ఇంటిపని చూసుకుంటూ.. కుమారుడిని తీర్చిదిద్దుతున్నారు. తనిష్క్‌కు అన్నిరకాలుగా ఆమె మనోధైర్యాన్ని ఇస్తున్నారు.