హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రగడ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌పై మాజీ కార్యవర్గ సభ్యులు అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్, శేష్‌నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఫతే మైదాన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏలో నెలకొన్న అవినీతి, ప్లేయర్ల ఎంపిక విషయంలో అవకతవకలు, కొన్ని క్లబ్‌లపై పక్షపాత వైఖరి తదితర అంశాలపై వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తొలుత అర్షద్ మాట్లాడుతూ ‘హెచ్‌సీఏను అజర్ భ్రష్టు పట్టించాడు. కాసుల కక్కుర్తితో ప్రతిభకు పాతరేస్తున్నారు.
అపెక్స్ కౌన్సిల్, ఏజీఎం, హెచ్‌సీఏ రాజ్యాంగం దేన్ని ఖాతరు చేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నాడు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కక్ష్య సాధిస్తున్నారు. వారి క్లబ్‌ల గుర్తింపు రద్దు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు’ అని ఆరోపించారు. మరోవైపు శివలాల్ యాదవ్ స్పందిస్తూ ‘హెచ్‌సీఏ పాలన వ్యవహారాలు గాడి తప్పినా ఎవరూ నోరు ఎత్తకూడదంటూ అజర్ వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ నుంచి ఎలాంటి లెక్కాపత్రం లేకుండా పోయింది. బోర్డు నుంచి వస్తున్న నిధులపై ఎలాంటి స్పష్టత లేదు. గత మూడేండ్లలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు దిక్కులేకుండా పోయింది. అసోసియేషన్‌తో సంబంధం లేకుండా జూనియర్, సీనియర్ స్థాయిలో సొంత సెలెక్షన్ కమిటీలు ఏర్పాటు చేసి ప్లేయర్లను ఎంపిక చేస్తున్నారు.
ప్రతిభ కల్గిన ప్లేయర్లను పక్కకు పెడుతూ పైసలకు మొగ్గుచూపుతున్నారు’అని మండిపడ్డారు. మరోవైపు శేష్‌నారాయణ మాట్లాడుతూ ‘అజర్ అధ్యక్షుడు అయ్యాక.. హెచ్‌సీఏలో జవాబుదారీతనం పోయి నియంతృత్వం వచ్చింది. ఒకే ప్యానెల్లో పోటీ చేసి% ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. హెచ్‌సీఏ పరిపాలనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజువారీ పాలన చూసుకోవాలని కోర్టు సూచించినా పెడచెవిన పెడుతూ సొంత ఎజెండాతో ముందుకెళుతున్నారు. జిమ్ కోసం బీసీసీఐ 2.11 కోట్లు కేటాయించినా.. ఇప్పటి వరకు సామగ్రి కొన్న పరిస్థితి లేదు. ప్రస్తుత కార్యవర్గం నెల రోజుల్లో ముగుస్తుంది’ అని అన్నారు. ఈ సమావేశంలో జాన్ మనోజ్, నరేశ్‌శర్మ, దేవ్‌రాజ్, శ్రీధర్ కూడా పాల్గొన్నారు.