ముంబై : టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా టూరుకు రెండు వారాల ముందు అతనికి వెన్ను నొప్పి వచ్చినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలిసింది. అక్టోబర్ 29 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులో శివం దూబే ఉన్నాడు. వాస్తవానికి శివం దూబే ముంబై జట్టు తరపున రంజీలో ఆడాల్సి ఉన్నది. జమ్మూకశ్మీర్‌తో జరిగే రంజీ మ్యాచ్‌లో ఆడేందుకు కొన్ని రోజుల క్రితం దూబే జమ్మూకు వెళ్లాడు. కానీ అక్కడ ఉన్న కోల్డ్ వెదర్ వల్ల శివం దూబే ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సమయంలో అతని వెన్ను పట్టేసినట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. గాయం తీవ్రం కాకముందే ముంబై జట్టు జాగ్రత్త పడింది. దీంతో అతను మంగళవారం తిరిగి ముంబై చేరుకున్నాడు. మెడికల్ టీమ్ ఇచ్చిన సలహా మేరకు దూబే రెస్టు తీసుకోనున్నాడు.
ఆసీస్ టూరుకు ప్రకటించిన 16 మంది సభ్యుల టీ20 బృందంలో శివం దూబే ఉన్నాడు. అయితే ఆ భారీ టూరుకు ముందే దూబేకు గాయం కావడం కొంత ఆందోళనకరంగా కనిపిస్తున్నది. కానీ ఆ సిరీస్ ప్రారంభం కావడానికి ముందే దూబే మళ్లీ ఫిట్ అవుతాడని ఓ మీడియా తన కథనంలో తెలిపింది. ఈ వారం చివరలోగా శివం దూబే ఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ముంబై టీమ్ నిపుణులు చెబుతున్నారు.