న్యూయార్క్: కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ యుఎస్ ఓపెన్ తొలి రౌండ్లో సునాయాసంగా నెగ్గి ముందంజ వేసింది. సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెరెనా 6-3, 6-3తో డంకా కొవినిక్‌పై విజయం సాధించింది. యుఎస్ ఓపెన్‌లో ఎన్నడూ తొలి రౌండ్లో ఓటమి ఎరుగని 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనాకు ఫ్లషింగ్ మెడోస్‌లో ఇది 106వ విజయం కావడం విశేషం. రిటైర్మెంట్పై సెరెనా అధికారిక ప్రకటన చేయకున్నా.. అమెరికా స్టార్‌కు ఇదే ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అనే వార్తలు వినిపిస్తున్నాయి. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్న యుఎస్ ఓపెన్లోనే సెరెనా తన కెరీర్‌కు ముంగింపు పలుకుతుందని అనుకుంటున్నారు.
సెరెనా ఆటను చూసేందుకు వచ్చిన 23 వేల మంది అభిమానుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్, ప్రముఖ హాలీవుడ్ నటుడు జాక్మన్, అమెరికా టెన్నిస్ దిగ్గజం బిల్లీ జీన్ కింగ్, తదితరులు ఉన్నారు. తొలి సెట్ ఆరంభంలో కాస్త తడబడ్డ సెరెనా.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో ఆరంభంలోనే బ్రేక్ సాధించి 3-2 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అదే జోరు కొనసాగిస్తూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ 6-3, 6-0తో జాస్మిన్ పాలోనిపై, కొంటావిట్ 6-3, 6-0తో జాక్వెలిన్ క్రిస్టియన్‌పై, ఫెర్నాండెజ్ 6-3, 6-4తో ఓసియన్ డొడిన్పై, క్రెజికోవా 6-0, 6-4తో ఫెర్నాండ గొమెజ్పై, షెల్బీ రోజర్స్ 3-6, 6-3, 6-4తో అరంట్జా రాస్‌పై, జేబుర్ 7-5, 6-2తో మాడిసన్ బ్రెంగిల్పై గెలుపొందారు.
పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా భావించిన నాలుగో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్, పదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్లకు తొలి రౌండ్లోనే చుక్కెదురయింది. సిట్సిపాస్ 0-6, 1-6, 6-3, 5-7తో డేనియల్ గాలన్ చేతిలో, ఫ్రిట్జ్ 7-6 (3), 6-7 (1), 3-6, 4-6తో బ్రాండన్ హాల్ట్ చేతిలో ఓడిపోయారు. ఇతర మ్యాచ్‌లలో అగర్ 6-3, 6-4, 3-6, 6-3తో అలెగ్జాండర్ రిచర్డ్‌పై. పాబ్లొ 7-5, 6-1, 5-7, 6-3తో థీమ్‌పై, అలెక్స్ డి మినార్ 7-5, 6-2, 6-3తో ఫిలిప్ క్రజినోవిచ్పై విజయం సాధించారు.