Asia Cup : ఆసియా కప్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. పొట్టి ఫార్మాట్లో జరుగబోయే ఈ టోర్నీ సెప్టెంబర్ 9న మెగా టోర్నీ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ప్రసారహక్కులు దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్ (Sony Sports) ప్రోమో వీడియో విడుదల చేసింది. అయితే.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ పెంచుతూ రూపొందించిన వీడియో వివాదానికి కేంద్రమైంది. ప్రస్తుతం ఇరుదేశాలు ఉప్పు నిప్పులా ఉన్న సమయంలో దాయాదుల మ్యాచ్ గురించి ప్రచారం చేయడం తగదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ప్రోమోలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) నటించడంతో నెటిజన్ల ఆగ్రహం తారాస్థాయికి చేరింది. ఎందుకంటే..?
పహల్గాంపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన సెహ్వాగ్ ఆసియా కప్ ప్రోమోలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రమోట్ చేశాడు. సెప్టెంబర్ 14న షార్జాలో తలపడనున్న చిరకాల ప్రత్యర్థుల గేమ్‌పై నెలకొన్న ఉత్కంఠను చూపిస్తున్న ఈ వీడియో వీరూ ఉండడం కొందరు అభిమానులకు మింగుడుపడడం లేదు. అప్పుడు దాయాదితో క్రికెట్ వద్దే వద్దని చెప్పిన వీరూ ఇప్పుడు నవ్వుతూ యాడ్‌లో కనిపించడం ఏంటీ? మనసు మార్చుకున్నాడా ఏంటీ? అని సందేహాలు వెలిబుచ్చుతున్నారు.
140 crore dhadkanein ek saath dhadkegi apni #TeamIndia ke liye! 💙🇮🇳 Kyunki rag rag mein hain rang Bharat ka. 🇮🇳🔥
Dekhiye Asia Cup September 9 se Sony Sports Network ke TV Channels aur Sony LIV par!#RagRagMeinBharat #TeamIndia #AsiaCup #SonyLIV #SonySportsNetwork pic.twitter.com/SgCFONOm6n
— Sony Sports Network (@SonySportsNetwk) August 22, 2025
అయితే.. ఐసీసీ, ఆసియా కప్ వంటి మెగా టోర్నీలు మినహా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని బీసీసీఐ తేల్చి చెప్పిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు క్రికెట్ లవర్స్. ఈ ప్రోమో రూపొందించిన సోనీ స్పోర్ట్స్ మాత్రం ఈ వివాదంపై ఇంకా స్పందించాల్సి ఉంది.
ఐసీసీ టోర్నీ అయినా.. అసియా కప్ అయినా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఇచ్చే కిక్కే వేరు. అందుకే అభిమానులు దాయాదుల మ్యాచ్‌పై ఎక్కడలేని ఆసక్తి కనబరుస్తారు. కానీ.. ఈసారి ఇరుదేశాల నడుమ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి.. ఆపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టడం వంటివి ఉద్రిక్తతలకు దారితీశాయి. ఎట్టకేలకు కాల్పుల విరమణతో రాజీకి వచ్చినా దౌత్య, వాణిజ్య, క్రీడాపరమైన అంశాల్లో వైరుధ్యం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో పాక్‌తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ ఆటగాళ్లు నిరాకరించారు. లీగ్ దశ.. సెమీ ఫైనల్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశారు. దాంతో, ఆసియా కప్‌లోనూ పాకిస్థాన్‌తో ఆడొద్దని పలువురు నెట్టింట పోస్ట్‌లు పెడుతున్నారు.