SAvsAUS: కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికాను సెంచరీతో ఆదుకున్న స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 116 బంతుల్లో 101 పరుగులు చేయడం ద్వారా మిల్లర్.. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సఫారీలు 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మిల్లర్.. శతకంతో ఆదుకోవడం ద్వారా ఆ జట్టు ఆసీస్ ఎదుట పోరాడే లక్ష్యాన్ని నిలపగలిగింది.
వన్డే వరల్డ్ కప్ టోర్నీలలో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఫాఫ్ డుప్లెసిస్.. 2015 వరల్డ్ కప్ సెమీస్‌లో కివీస్‌పై 82 పరుగులు సాధించాడు. ఇదే టోర్నీలో క్వింటన్ డికాక్ ఆసీస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పుడు ఈ రెండు రికార్డులనూ మిల్లర్ బ్రేక్ చేశాడు.
ఐసీసీ టోర్నీల పరంగా చూస్తే సౌతాఫ్రికాకు ఇది మూడో శతకం మాత్రమే. 2002లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఇండియాతో ఆడిన మ్యాచ్‌లో హెర్షలీ గిబ్స్ 116 పరుగులు చేశాడు. 1998 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో జాక్వస్ కలిస్ కూడా113 పరుగులు చేయగా తాజాగా మిల్లర్ వన్డే వరల్డ్ కప్‌లో ఈ ఫీట్ సాధించడం గమనార్హం.
Picture 🔥
David Miller becomes the first South African Men’s player to score a hundred in World Cup Knock-outs.#SAvsAUS— VINEETH𓃵🦖 (@sololoveee) November 16, 2023
ఆస్ట్రేలియాతో వన్డేలలో మిల్లర్‌కు ఇది మూడో శతకం. ఫాఫ్ డుప్లెసిస్ ఐదు శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐదో స్థానం లేదా ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసినవారిలో క్రిస్ కెయిన్స్ (ఇండియాపై), ఇయాన్ మోర్గాన్ (ఆసీస్‌పై), కెవిన్ పీటర్సన్ (సౌతాఫ్రికాపై) ల తర్వాత మిల్లర్ నిలిచాడు.