Sarabjot Singh : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో మను భాకర్ (Manu Bhaker) తో కలిసి సరబ్జోత్ సింగ్ (Sarabjot Singh) కాంస్య పతకం (Bronz Medal) గెలిచాడు. దాంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో మను భాకర్ కాంస్యం గెలిచారు. దాంతో ఈ ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు కాంస్యాలు గెలిచినట్లయ్యింది. రెండు మెడల్స్ సాధించడం ద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా మనూ భాకర్ నిలిచింది.
అయితే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున తొలి పతకం సాధించినప్పుడు మను భాకర్ దేశమంతటికి సుపరిచితురాలు అయ్యారు. కానీ సరబ్జోత్ సింగ్‌కు అంత పబ్లిసిటీ రాలేదు. ఇప్పుడు మను భాకర్‌తో కలిసి కాంస్యం గెలువడం ద్వారా సరబ్జోత్ కూడా వార్తల్లో వ్యక్తిగా మారారు. మరి ఆయన ఎవరు..? నేపథ్యం ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇరవై రెండేళ్ల సరబ్ జోత్ సింగ్ ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. సరబ్జోత్ తండ్రి జితేందర్ సింగ్ ఒక సాదాసీదా రైతు. సరబ్జోత్ చండీగఢ్‌లోని DAV కాలేజీలో విద్యను అభ్యసించాడు. చదువుతూనే మరోవైపు ఆటల్లో రాణించాడు. 2022లో జరిగిని ఏషియన్ గేమ్స్‌లో సరబ్జీత్ ఒక బంగారు పతకం, ఒక రజత పతకం నెగ్గాడు. 2023లో జరిగిన షూటింగ్ ప్రపంచకప్‌లో రెండు గోల్డ్ మెడల్స్ గెలిచాడు. తద్వారా పారిస్ ఒలింపిక్స్ 2024కు అర్హత సాధించాడు.