భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది సీజన్‌తో తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించింది. 35 ఏళ్ల సానియా మహిళల డబుల్స్ టెన్నిస్ విభాగంలో ఎన్నో అద్భుతాలు చేసింది. భారత్‌కు మరపురాని విజయాలు అందించింది. తొలి గ్రాండ్‌స్లామ్ అందుకున్న భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో సానియా, నదియా కిచెనాక్ జోడీ.. తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే స్పందించిన సానియా.. ‘‘కొన్ని కారణాలున్నాయి. జస్ట్ నేనిక ఆడను అని సడెన్‌గా నిర్ణయం తీసుకోలేదు. గతేడాది చివర లేదంటే ఈ ఏడాది ఆరంభంలోనే నాకు తెలుసు. ఇదే ఇక నా చివరి సీజన్ అని.
ఎందుకంటే నా శరీరం మునపటిలా లేదు. ఇప్పటి మ్యాచ్‌లో కూడా నా మోకాలు నొప్పి పెడుతూనే ఉంది. అందుకనే ఓడిపోయామని నేననడంలేదు. జస్ట్.. వయసు పెరిగేకొద్దీ కోలుకోవడానికి సమయం పడుతోంది. నేను ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఆడుతూనే ఉంటానని ఎప్పటినుంచో చెప్తున్నా. కానీ ఇప్పుడు గతంలో ఉన్నంత ఉత్సాహం రావడం లేదు.
దానికితోడు నా రెండేళ్ల కుమారుడిని వెంట పెట్టుకొని ప్రయాణాలు చేయడం పిల్లాడికి కూడా మంచిది కాదు. దాన్ని కూడా నేను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని సానియా వెల్లడించింది. ప్రస్తుతం సానియా 68వ ర్యాంకులో ఉంది. తన కెరీర్లో అత్యుత్తమంగా డబుల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచింది.
సింగిల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంకులో నిలిచింది. చివరగా 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి టైటిల్ గెలిచింది. వీళ్లిద్దరూ మహిళల టెన్నిస్‌లో అత్యుత్తమ జోడీల్లో ఒకరిగా వెలుగొందిన విషయం తెలిసిందే.