Sachin Tendulkar : భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా (Sara) తండ్రిలా క్రికెటర్ అవ్వాలనుకోలేదు. తన తల్లి అంజలి మాదిరిగా మెడిసిన్ చదవాలనుకుంది. కానీ ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ సొంతంగా ముంబైలో ‘పిలాటిస్ స్టూడియో’ను ప్రారంభించింది. లెజెండరీ క్రికెటర్ బిడ్డగా ఈ ప్రపంచానికి పరిచయం అయిన సారా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనుకొని వెల్నెస్ రంగంలోకి వచ్చింది. ఈమధ్యే ఆమె తన స్నేహితులతో కలిసి పిలాటిస్ అకాడమీని ఏర్పాటు చేయగా సచిన్ దానిని ప్రారంభించాడు. ఈ సందర్భంగా తన తనయను ఆకాశానికెత్తేశాడు మాస్టర్ బ్లాస్టర్.
తల్లిదండ్రులు తమ పిల్లలు తమ కెరీర్లో విజయవంతం కావాలని కోరుకుంటారు. సచిన్, అంజలి దంపతులు కూడా తమ సంతానమైన సారా, అర్జున్‌లు గొప్పగా ఏదైనా సాధించాలని కలలు కన్నారు. అర్జున్ క్రికెటర్‌గా రాణిస్తుంటే.. కూతురు మాత్రం వెల్నెస్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు సచిన్.
‘తల్లిదండ్రులుగా మన పిల్లలు తమకు నచ్చిన రంగంలోకి వెళ్లాలని కోరుకుంటాం. సారా సొంతంగా పిలాటిస్ స్టూడియో ప్రారంభించడం మా హృదయాలను ఉప్పొంగేలా చేసింది. వెల్నెస్కు సంబంధించిన స్టూడియో పెట్టాలనేది ఆమె డ్రీమ్. తన కలను సాకారం చేసుకునేందుకు సారా ఎంతో శ్రమించింది. చెప్పాలంటే ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు.. ప్రతిదీ తనే స్వయంగా సమకూర్చుకొని ఈ స్టూడియోకు రూపమిచ్చింది. పోషకాహారం తీసుకోవడం, చలిస్తూ ఉండడం.. ఈ రెండూ మనందరి జీవితాల్లో చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని పెంచే ఈ రెండిటిని మేళవించిన తన రంగంలో తాను ముందుకెళ్లడం నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. సారా నిన్ను చూసి గర్వపడకుండా ఉండలేకపోతున్నా. నీ కలల ప్రయాణం మొదలవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని సచిన్ భావోద్వేగంతో చెప్పాడు.
ఆగస్టు ఆరంభంలో సారా తాను సొంతంగా పిలాటిస్ స్టూడియో ఓపెన్ చేస్తున్నట్టు అందరికీ తెలియజేసింది. బయోమెడికల్ సైన్స్‌లో డిగ్రీ.. ఆ తర్వాత క్లినికల్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్లో పీజీ చదివిన సారా కొన్నిరోజులు మోడల్‌గానూ మెరిసింది. ఈమధ్యే తమ కుటుంబం నిర్వహిస్తున్న సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌లో డైరెక్టర్‌గా చేరింది సారా. ఇప్పుడు పిలాటెస్ స్టూడియోతో ఈ తరానికి ఫిట్నెస్, వెల్నెస్ పాఠాలు బోధించనుందీ బ్యూటిఫుల్ లేడీ.