Andrew Russell : మినీ వేలానికి ముందే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఆండ్రూ రస్సెల్ (Andrew Russell). విధ్వంసక ఆటగాడిగా, సిక్సర్ల వీరుడిగా పేరొందిన రస్సెల్ సుదీర్ఘ కెరీర్‌ను నవంబర్ 30న ముగించాడు. కోల్‌కతా అతడిని రీటైన్ చేసుకోకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఈ కరీబియన్ పవర్ హిట్టర్ రిటైర్మెంట్ దారి ఎంచుకున్నాడు. సంచలన నిర్ణయంతో అభిమానులను షాక్‌కు గురి చేసిన రస్సెల్.. ఈ హఠాత్తు అల్విదా ప్రకటనపై స్పందించాడు. మరో జెర్సీలో తనను తాను ఊహించుకోలేకనే వేలం ముందు అల్విదా చెప్పానంటున్నాడీ ఐపీఎల్ లెజెండ్.
ఐపీఎల్ వేలానికి గడవు సమీపిస్తున్న వేళ రస్సెల్ వీడ్కోలు వార్త పెద్ద చర్చకు తెరతీసింది. వేలంలో అతడిని కొనాలనుకున్న ఫ్రాంఛైజీలు, సిక్సర్ల యోధుడి ఆట చూడాలనుకున్న అభిమానులు షాక్‌లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తన వీడ్కోలుకు అసలైన కారణం చెప్పేశాడీ విండీస్ క్రికెటర్. ‘సోషల్ మీడియాలో నా ఫొటో వేరు జట్ల జెర్సీతో ప్రచారమవ్వడం చూశా. ఊదా, పసిడి రంగు జెర్సీలో కాకుండా నన్ను మరో జెర్సీలో ఊహించుకోలేకపోయాను. అరే.. నేను ఇకపై మరో జట్టుకు ఆడాలా? అనే ఆలోచనలతో రాత్రిళ్లు నాకు నిద్రపట్టలేదు. అందుకే.. వీడ్కోలు నిర్ణయం తీసుకున్నా. సంతోషకరమైన విషయం ఏంటంటే.. నేను మళ్లీ కోల్‌కతా ఫ్రాంచైజీతోనే కొనసాగుతున్నా’ అని రస్సెల్ వెల్లడించాడు. ఈ చిచ్చరపిడుగును రీటైన్ చేసుకోని కోల్‌కతా రూ.64.30 కోట్లతో మినీ వేలంలో పాల్గొననుంది.
1️⃣2️⃣ years, a million memories. Thank you for everything @Russell12A 💜🫶 pic.twitter.com/ijzY68fAdG
— KolkataKnightRiders (@KKRiders) November 30, 2025
‘ఐపీఎల్ ఒక అద్భుతమైన ప్రయాణం. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో 12 సంవత్సరాల మధుర జ్ఞాపకాలు. కేకేఆర్ ఫ్యామిలీ నుంచి చాలా ప్రేమ ఉంది. నేను ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర లీగ్‌లలో సిక్సర్లు కొట్టడం, వికెట్లు తీయడాన్ని కొనసాగిస్తాను. ముఖ్యమైన విషయం ఏంటంటే.. నేను కేకేఆర్‌ను వదిలి వెళ్లడం లేదు. మీరు నన్ను కొత్త పాత్రలో చూస్తారు. 2026లో కేకేఆర్ పవర్ కోచ్‌గా పని చేస్తాను. ఇది నాకొక కొత్త అధ్యాయం. కానీ, అదే శక్తి, ఎల్లప్పుడూ నైట్ రైడర్స్‌లో భాగం’ అని పేర్కొన్నాడు.
ఐపీఎల్లో11 సంవత్సరాల పాటు కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు రస్సెల్. 2014లో ఫ్రాంచైజీలో చేరిన అతడు తన విధ్వంసక ఆటతో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పర్పుల్ జెర్సీతో 133 మ్యాచులు ఆడిన అతడు.. 2014, 2024లో కేకేఆర్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో.. పద్దెనిమిదో సీజన్లో రూ.12 కోట్లకు ఈ స్టార్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకుంది ఫ్రాంచైజీ. అయితే.. రస్సెల్ 13 ఇన్సింగ్స్‌లో 167 పరుగులు, ఎనిమిది వికెట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ కెరీర్లో ఈ కరీబియన్ వీరుడు 140 మ్యాచుల్లో 174.18 స్ట్రయిక్ రేటుతో 2,651 పరుగులు చేసి.. 123 వికెట్లు పడగొట్టాడు.
Hanging up my IPL boots… but not the swagger 💜💛
What a ride it’s been in the IPL — 12 seasons of memories, and a whole lot of love from the @KKRiders family 🙏🏿
I’ll still be smashing sixes and taking wickets in every other league around the world 🌎🔥
And the best part?… pic.twitter.com/S5kU0YFRcR
— Andre Russell (@Russell12A) November 30, 2025