బెంగళూరు: ఐపీఎల్ పునఃప్రారంభం మ్యాచ్ రద్దుతో మొదలైంది. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణంతో నిలిచిపోయి తొమ్మిది రోజుల తర్వాత తిరిగి మొదలైన ఐపీఎల్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఎడతెరిపిలేని వర్షంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తడిసిముద్దయ్యింది. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మధ్య మ్యాచ్ వర్షం కారణంగా కనీసం టాస్ పడకుండానే రద్దయ్యింది. ఎంతసేపటికి వర్షం తగ్గే సూచన కనిపించకపోవడం, మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మ్యాచ్ రద్దుతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్ మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మరోవైపు ఒక పాయింట్ ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ 17 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే అంతర్జాతీయ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లీ ఆడుతున్న తొలి మ్యాచ్ చూసేందుకు అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి భారీగా తరలివచ్చారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కోహ్లీ టెస్టు జెర్సీలు ధరించి స్టేడియానికి వచ్చారు. తెలుపు రంగు జెర్సీలతో చిన్నస్వామి స్టేడియం కొత్తరూపు సంతరించుకుంది. వర్షం తగ్గుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు ఆఖరికి నిరాశే ఎదురైంది. మ్యాచ్ రద్దయ్యిందని అంపైర్లు ప్రకటించగానే భారంగా మైదానాన్ని వీడారు. ఆదివారం ఐపీఎల్లో డబుల్ హెడర్ జరుగనుంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్-పంజాబ్ తలపడనుండగా, రెండో పోరులో ఢిల్లీ, గుజరాత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.