Rohit Sharma: సారథిపై విమర్శలు వచ్చేందుకు ఒక్క మ్యాచ్ ఫలితం తారుమారైతే చాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోకపోతే ప్రశంసించినవాళ్లే.. విమర్శిస్తారని హిట్మ్యాన్ వెల్లడించాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. సారథిగా ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడమే తన కర్తవ్యమని.. ఫలితాల గురించి పెద్దగా ఆలోచించను అని రోహిత్ వెల్లడించాడు.
‘ప్రతి మ్యాచ్కు సన్నద్ధత అవసరం. ప్రత్యర్థి బలమేంటి, బలహీనత ఏంటీ అనే దాన్ని బట్టి ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ఉంటా.. దాన్నే బౌలర్లకు చెప్తా. ప్రతి చిన్న విషయంపై విశ్లేషన చేసి అందుకు తగ్గట్లు ప్రణాళికల్లో మార్పులు చేస్తా. కొన్ని సార్లు అవి మెరుగైన ఫలితాలను అందివ్వచ్చు. కొన్ని సార్లు పనిచేయకనూ పోవచ్చు. అంత మాత్రాన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రణాళిక రూపకల్పన నిరంతర పని. కొన్నిసార్లు చిన్న మార్పులతో కూడా అత్యధిక ప్రభావం చూపొచ్చు’ అని రోహిత్ అన్నాడు.
సమిష్టి ప్రదర్శనలే జట్టును విజయ తీరాలకు చేర్చుతాయని.. ఏ ఒక్క ఆటగాడో మెరుగ్గా ఆడితే సరిపోదని రోహిత్ అన్నాడు. ‘చెడ్డ కెప్టెన్ అనిపించుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అంతా సవ్యంగా కనిపిస్తున్నది. ఒక్క చెడ్డ మ్యాచ్ మొత్తం మార్చేస్తుంది. ప్రస్తుతం ప్రశంసిస్తున్న వాళ్లే విమర్శలకు దిగుతారు. ప్రతి మ్యాచ్ గెలువాలనే సంకల్పంతోనే మైదానంలో అడుగుపెడతా. అందుకోసం వంద శాతం కృషి చేస్తా’ అని రోహిత్ వివరించాడు.