జొహన్నస్‌బర్గ్: టీ20 స్పెషలిస్ట్ హిట్టర్ రింకూ సింగ్(Rinku Singh) పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ఆ స్ట్రయిక్ బ్యాటర్ వరుసగా విఫలం అవుతున్నాడు. నిజానికి అతను ఆడుతున్న బ్యాటింగ్ పొజిషన్ పెద్ద సమస్యగా మారింది. టీ20 సిరీస్‌పై కన్నేసిన భారత్.. రింకూ ఫామ్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సఫారీ సిరీస్‌లో శాంసన్, తిలక్‌లు సెంచరీలతో అదరగొట్టారు. కానీ సమిష్టిగా ఆడి మ్యాచ్‌ను గెలిపించే సత్తా భారత్ జట్టు కోల్పోతున్నది. బ్యాటింగ్ పొజిషన్లలో జరుగుతున్న మార్పులు కూడా కీలకంగా మారాయి.
టీ20ల్లో లోయర్ ఆర్డర్లో వచ్చి భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న బ్యాటర్ రింకూ సింగ్. కానీ గత కొన్ని నెలల నుంచి అతని ప్రతిభ కనిపించడంలేదు. బ్యాటింగ్ పొజిషన్లో క్రమంగా జరుగుతున్న మార్పులు అతన్ని ఇబ్బందిపెడుతున్నట్లు అనిపిస్తోంది. ఆరవ, ఏడవ నెంబర్లో బ్యాటింగ్‌కు పంపడం వల్ల .. రింకూ సింగ్ కు దోహదపడడం లేదు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో జరిగిన తొలి రెండు మ్యాచుల్లో రింకూ ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు, ఇక మూడవ మ్యాచ్‌లో ఏడవ నెంబర్లో బ్యాటింగ్ చేశాడు. అతను మూడు ఇన్నింగ్స్‌లో కేవలం 28 రన్స్ చేశాడు. 11, 9, 8 రన్స్ స్కోర్ చేశాడు.
అయితే ఆ మూడు మ్యాచుల్లో అతను ఎదుర్కొన్నది 34 బంతులే. ఫినిషర్‌గా పేరుగాంచిన రింకూ సింగ్.. కీలక సమయంలో రాణించలేకపోతున్నాడు. ఇది ఆందోళనకంగా మారుతోంది. చివరి ఐపీఎల్లో కేకేఆర్ తరపున 15 మ్యాచ్‌లు ఆడిన రింకూ కేవలం 113 బంతులు మాత్రమే ఆడాడు. అంటే ప్రతి మ్యాచ్‌కు అతను 7.5 బంతులు మాత్రమే ఆడాడు. సగటున 10 బంతులు మాత్రమే ఆడుతున్న రింకూ.. తన పొజిషన్లో స్కోరింగ్ చేయలేకపోతున్నాడు. గతంలో అయిదవ నెంబర్ పొజిషన్లో ఆడినప్పుడు రింకూ మంచి స్కోరింగ్ చేశాడు.
ఓపెనర్‌గా శాంసన్, మూడవ నెంబర్లో తిలక్ ఆడడం వల్ల రింకూ బ్యాటింగ్ పొజిషన్ సమస్యగా మారింది. హార్దిక్ పాండ్యా కన్నా ముందు రింకూను పంపలేని పరిస్థితి ఉన్నది. దీంతో రింకూ ఫామ్, పొజిషన్ గందరగోళంలో పడింది.