వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన వారం రోజుల వ్యవధిలోనే భారత్‌కు భంగపాటు ఎదురైంది. పొట్టి ఫార్మాట్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్..జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. సీనియర్ల గైర్హాజరీలో యువ క్రికెటర్లు విఫలమైన వేళ టీమ్ఇండియా తొలి టీ20లో 102 పరుగులకే కుప్పకూలింది.భారత్ వరుస విజయాల ప్రస్థానానికి చెక్ పెట్టిన జింబాబ్వే సిరీస్‌లో అదిరిపోయే బోణీ కొట్టింది. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన అరంగేట్రం హీరోలు అభిషేక్‌శర్మ, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయారు. బిష్ణోయ్ స్పిన్ ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమైన జింబాబ్వే..సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ భారత్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది.
Team India | హరారే: జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ భారత్‌కు ఆదిలోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఐపీఎల్లో పరుగుల వరద పారించిన యువ క్రికెటర్లు..అంతగా అనుభవం లేని జింబాబ్వేపై పూర్తిగా తేలిపోయారు. శనివారం జరిగిన లోస్కోరింగ్ తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో జింబాబ్వే చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. తొలుత రవి బిష్ణోయ్(4/13), సుందర్(2/11) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 115/9 స్కోరు చేసింది. ైక్లెవ్ (29 నాటౌట్), డియాన్ మేయర్(23) రాణించారు.
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(31), సుందర్(27) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన అభిషేక్(0), పరాగ్(2), జురెల్(6) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కెప్టెన్ సికిందర్ రజా(3/25), చతార(3/16) టీమ్ఇండియా బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రజాకు ‘మ్యాన్ ఆప్ ద మ్యాచ్’ దక్కింది.
బిష్ణోయ్ ధమాకా: టాస్ గెలిచిన గిల్..జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముకేశ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఓపెనర్ ఇన్నోసెంట్ కయా(0) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన బెన్నెట్(22)దూకుడు ప్రదర్శించాడు. మరో ఎండ్‌లో ఉన్న వెస్లీ మెద్వెరె..ఖలీల్ ఐదో ఓవర్లో నాలుగు ఫోర్లతో 17 పరగులు పిండుకున్నాడు. జోరుమీదున్న జింబాబ్వే ఇన్నింగ్స్‌ను బిష్ణోయ్ వచ్చిరాగానే బెన్నెట్‌ను ఔట్ చేసి దెబ్బతీశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి జింబాబ్వే 40/2 స్కోరు చేసింది. ఈ క్రమంలోనే రజా(17), క్యాంప్‌బెల్(0) వెంటవెంటనే ఔటయ్యారు. మరో ఎండ్‌లో బౌలింగ్‌కు వచ్చిన సుందర్..వరుస బంతుల్లో మయేర్స్(23), మసకద్జ(0)ను ఔట్ చేయగా, బిష్ణోయ్..జాంగ్వె(1), ముజర్బనీ(0)పెవిలియన్ పంపి మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఇక జింబాబ్వే పని అయిపోయిందనుకున్న తరుణంలో ైక్లెవ్ బ్యాటు ఝులిపించడంతో మెరుగైన స్కోరు అందుకుంది.
భారత్ తడబాటు: స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు ఆదిలోనే కోలుకోలేని దెబ్బలు తగిలాయి. యువ ఓపెనర్ అభిషేక్ కనీసం పరుగుల ఖాతా తెరువకుండానే డకౌట్ అయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కూడా నిరాశపర్చాడు. రియాన్ పరాగ్, రింకూసింగ్(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో పవర్‌ప్లేలో టీమ్ఇండియా 22 పరుగులకే 4 నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఒక ఎండ్‌లో సహచరులు ఔట్ అవుతున్నా..గిల్ సంయమనం పాటించాడు. జురెల్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించాడు. కానీ చతార, రజా వరుస వికెట్లు తీసి టీమ్ఇండియా బ్యాటింగ్‌ను కకావికలు చేశారు. నాలుగు పరుగుల తేడాతో జురెల్, గిల్ ఔట్ కావడంతో భారత్ పరాజయం ఖరారైంది. ఆఖర్లో సుందర్, అవేశ్‌ఖాన్(16) పోరాడినా లాభం లేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే: 20 ఓవర్లలో 115/9(ైక్లెవ్ 29 నాటౌట్, మయేర్స్ 23, బిష్ణోయ్ 4/13, సుందర్ 2/11),
భారత్: 19.5 ఓవర్లలో 102 ఆలౌట్(గిల్ 31, సుందర్ 27, చతార 3/16, రజా 3/25)