ముంబై: ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ మరోసారి అదరగొట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరు చేసింది. ఆరంభంలో డుప్లెసిస్(50: 41 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్), ఆఖర్లో రవీంద్ర జడేజా(62 నాటౌట్: 28 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్లో జడేజా వరుసగా 6 6 N(నోబాల్)6 6 2 6 4 బాదడంతో ఒకే ఓవర్లో 37 పరుగులు వచ్చాయి.
జడ్డూ వీరవిహారం చేయడంతో చెన్నై అనూహ్యంగా 190 మార్క్ దాటింది. రుతురాజ్ గైక్వాడ్(33: 25 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్), సురేశ్ రైనా(24: 18 బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) ఆకట్టుకున్నారు. మొదటి మూడు ఓవర్లను కట్టుదిట్టంగా వేసి మూడు వికెట్లు తీసిన హర్షల్(3/51)..చివరి ఓవర్లో దారుణంగా తేలిపోయాడు. జడేజా విధ్వంసానికి పటేల్ చేతులెత్తేశాడు. చాహల్ ఒక వికెట్ పడగొట్టాడు.
చెన్నై ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టాప్ గేర్‌లో సాగింది. ఓపెనర్లు గైక్వాడ్, డుప్లెసిస్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరి విధ్వంసంతో తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం లభించింది. చాహల్ వేసిన 10వ ఓవర్లో గైక్వాడ్..జేమీసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా ఏ మాత్రం దూకుడు తగ్గించని డుప్లెసిస్ ఐపీఎల్లో 18వ హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హర్షల్ పటేల్ వేసిన 14వ ఓవర్లో డుప్లెసి ఔటైన తర్వాత స్కోరు వేగం తగ్గింది.
మొదట్లో చెన్నై జోరు చూస్తే స్కోరు అలవోకగా 180 దాటేలా కనిపించింది. మధ్య ఓవర్లలో బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారీ స్కోరు కష్టమనిపించింది. అనూహ్యంగా చెలరేగిన జడేజా చివరి ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. హర్షల్ వేసిన ఆఖరి ఓవర్లో జడ్డూ వరుసగా నాలుగు సిక్సర్లు బాది 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చివరి రెండు బంతులనూ 6, 4 కొట్టి ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు.
4 in a row!@imjadeja has smashed 4 SIXES in a row and has raced away to his 50 in just 25 balls! https://t.co/wpoquMXdsr #CSKvRCB #VIVOIPL pic.twitter.com/Pc52l4E8hd
— IndianPremierLeague (@IPL) April 25, 2021