దుబాయ్: మీడియం పేసర్ రాజ్ లింబాని (7/13) విశ్వరూపం చూపడంతో.. అండర్-19 ఆసియాకప్‌లో యువ భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన పోరులో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్ అండర్-19 జట్టును చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 22.1 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 13 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. రాజ్ 7 వికెట్లు పడగొట్టగా.. ఆరాధ్య శుక్లా రెండు వికెట్లు తీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 7.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. అర్షిన్ కులకర్ణి (43 నాటౌట్; ఒక ఫోర్, 5 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో మరో 257 బంతులు మిగిలుండగానే యంగ్‌ఇండియా విజయం సాధించింది.