యుగానికొక్కడు! పోరాటయోధుడు! అద్భుత ప్రతిభాశాలి! ఇలాంటి ఉపమానాలన్నీ అతనికే వర్తిస్తాయేమో! ఆట కోసమే పుట్టాడా అన్న రీతిలో మూడేండ్ల ప్రాయంలోనే రాకెట్ పట్టిన కుర్రాడు..ప్రపంచ టెన్నిస్‌ను శాసించిన వైనాన్ని ప్రశంసించేందుకు పదాలు కూడా వెతుక్కోవాల్సిందేమో! స్పెయిన్ బుల్గా టెన్నిస్ ప్రపంచాన్ని మకుటం లేని మహారాజుగా ఏలిన రఫెల్ నాదల్ అసమాన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాల పాటు ప్రపంచ క్రీడాభిమానులను తన అద్భుత ఆటతీరుతో అలరించిన నాదల్..ఆటకు ఇక సెలవంటూ ప్రకటించాడు. డేవిస్ కప్ టోర్నీ ఆఖరిదంటూ ప్రకటన చేసి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓపెన్ ఎరాలో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో తిరుగులేని టెన్నిస్ తారగా మన్ననలు పొందిన నాదల్..ఫ్రెంచ్ ఓపెన్‌పై చెరుగని ముద్రవేశాడు. అసలు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో 14 టైటిళ్లతో క్లే కింగ్ అన్న గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. రోజర్ ఫెదరర్, నొవాక్ జోకోవిచ్‌తో కలిసి బిగ్త్రీలో ఒకడైన నాదల్ లేని లోటు పూడ్చలేనిది.
Rafael Nadal | మాడ్రిడ్: ప్రపంచ టెన్నిస్‌లో ఒక శకానికి ముగింపు పడింది. క్రికెట్లో ఒక డాన్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్ ఎలాగో..టెన్నిస్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేర్లలో రఫెల్ నాదల్ ఒకటి. జూలపాల జుట్టుతో 15 ఏండ్ల ప్రాయంలోనే ప్రొఫెషనల్‌గా కెరీర్ మొదలుపెట్టిన నాదల్ 38 ఏండ్ల వయసులో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు అనూహ్యంగా ప్రకటించాడు. గాయాలు నీడలా వెంటాడుతున్న వేళ తిరిగి నిలదొక్కుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ పోరాట యోధుని కెరీర్ కొనసాగలేదు.
ప్రపంచ టెన్నిస్ అభిమానులను ఒకింత షాక్‌కు గురిచేస్తూ నాదల్ సోషల్‌మీడియాలో వీడియో ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటన వెలువరించాడు. నవంబర్‌లో జరిగే డెవిస్ కప్ ఫైనల్స్ తనకు చివరిదని పేర్కొన్నాడు. దేశం(స్పెయిన్) తరఫున చివరిసారి ఆడబోతున్నట్లు తెలిపాడు.
గతేడాది నుంచి రకరకాల గాయాలతో ఇబ్బంది పడుతున్న నాదల్..ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో స్పెయిన్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. సింగిల్స్‌లో జొకోవిచ్ చేతిలో ఓడిన నాదల్..డబుల్స్‌లో కార్లోస్ అల్కారజ్‌తో కలిసి క్వార్టర్స్ వరకు పోరాడాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే అనూహ్యంగా వెనుదిరగిన నాదల్ ఇదే తనకు చివరి సీజన్ అంటూ ప్రకటించాడు. అన్నట్లుగానే తన సుదీర్ఘ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టాడు.
గత కొన్నేండ్లుగా భారంగా గడుస్తున్నది. ముఖ్యంగా గత రెండేండ్ల నుంచి గాయాలు వేధిస్తున్నాయి. రిటైర్మెంట్ అనేది కఠిన నిర్ణయమైనా.. జీవితంలో ఏదో ఒక సమయంలో వీడ్కోలు పలుకాల్సిందే. ప్రతీ దానికి ఆరంభం ఎలా ఉంటుందో.. ముగింపు కూడా ఉంటుంది.
– రఫెల్ నాదల్
నాదల్ ఘనతలు