Chateshwar Pujara : ఇంగ్లండ్ పర్యటన మధ్యలో భారత జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. తొలి టెస్టు, లార్డ్స్ టెస్టులో ఓటమి ఎదురవ్వడంతో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై వేటు పడుతుందనే వార్తలు వినిపించాయి. కానీ, మాంచెస్టర్‌లో డ్రా, ఓవల్‌లో చిరస్మరణీయ విజయంతో శుభ్‌మన్ గిల్ సేన సిరీస్ సమం చేసింది. దాంతో.. తర్వాతి కోచ్ ఎవరు? అనే ప్రశ్నకు కాస్త బ్రేక్ పడింది. కానీ.. మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా (Chateshwar Pujara) మాత్రం భావి కోచ్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉండనే ఉన్నాడుగా అని అంటున్నాడు. ఒక కోచ్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలు అశ్విన్‌కు ఉన్నాయని.. అతడు కోచ్ అవుతాడనడంలో ఏమాత్రం సందేహమే లేదు అని చెబుతున్నాడీ వెటరన్.
‘అశ్విన్ లెజెండరీ ప్లేయర్. మూడు ఫార్మాట్లలో ఆడిన యశ్ బ్యాటుతో, బంతితో ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న అతడు భారత జట్టుకు ఏదోఒకరోజు ప్రధాన కోచ్ అవుతాడు. ఆల్‌రౌండర్ అయిన యశ్‌కు కోచ్‌లో ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. తదుపరి టీమిండియా కోచ్ ఎవరు? అనే ప్రశ్నకు నా సమాధానం అశ్విన్. అందులో నాకెటువంటి సందేహం లేదు’ అని పుజారా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో వెల్లడించాడు.
Who’s a Swiftie, and who’s most likely to dye their hair blue?
Cheteshwar Pujara gives the lowdown on his team-mates 🕵️♂️ pic.twitter.com/zMpaA2trWT
— ESPNcricinfo (@ESPNcricinfo) August 17, 2025
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ర్యాపిడ్ ఫైర్‌లో ఈ నయా వాల్ ఫటాఫట్ జవాబిచ్చాడు. మీరు ఏ భారత ఆటగాడితో రోజంతా గడపాలని అనుకుంటారు?.. విరాట్ కోహ్లీ, మీతో ఆడినవాళ్లలో ఎవరు రియాల్టీ షో ప్రారంభించాలని భావిస్తున్నారు? – శిఖర్ ధావన్. భారత జట్టుకు కోచ్ అయ్యే టీమ్మేట్ ఎవరు? – అశ్విన్. టేలర్ స్విప్ట్ కాన్సర్ట్‌కు హాజరయ్యే సహచరుడు ఎవరు? – కేఎల్ రాహుల్. అన్నిరకాల రికార్డులను బద్ధలు కొట్టే క్రికెటర్ ఎవరు? – విరాట్ కోహ్లీ.. రోజంతా క్రికెట్ గురించే చర్చించే ఆటగాడు ఎవరు? – అశ్విన్. తరచూ ఫోన్లో వీడియోలు చూసేది ఎవరు? – రిషభ్ పంత్. బ్యాట్లను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది ఎవరు? – సచిన్ టెండూల్కర్. జట్టుకు రంగేసుకునే ప్లేయర్ ఎవరు? – ఎంఎస్ ధోనీ. సహచరులకు బెస్ట్ గిఫ్ట్‌లు ఇచ్చే క్రికెటర్ ఎవరు? – రాహుల్ ద్రవిడ్.
భారత్‌కు ఆడిన గొప్ప స్పిన్నర్లలో ఒకడైన అశ్విన్ హఠాత్తుగా తన కెరీర్ ముగించాడు. కెరీర్ అద్భుతంగా సాగుతున్న సమయంలో 2024 డిసెంబర్లో వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే గబ్బా టెస్టు అనంతరం ఇక సెలవంటూ మీడియా సమావేశంలో వెల్లడించాడు. ప్రస్తుతం అశ్విన్ ఐపీఎల్, తమిళనాడు టీ20 లీగ్ వంటి ఫ్రాంచైజ్ క్రికెట్ టోర్నీల్లో ఆడుతున్నాడు. గ్రేటెస్ట్ స్పిన్నర్‌గా పేరొందని అశ్విన్ .. మూడు ఫార్మాట్లలో 765 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 537 వికెట్లు తీసిన అతడు అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాత భారత అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు నెలకొల్పాడు.