ముంబై: ముంబై క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw) కెరీర్ అగాధంలో పడింది. అతన్ని ముంబై రంజీ ట్రోఫీ బృందం నుంచి తప్పించారు. అగర్తలాలో అక్టోబర్ 26వ తేదీ నుంచి త్రిపుర జట్టులో మ్యాచ్ జరగాల్సి ఉన్నది. అయితే ఫిట్నెస్, క్రమశిక్షణా చర్యల కింద అతన్ని జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. టీమిండియా జాతీయ జట్టు తరపున అయిదు టెస్టులు, ఆరు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను.. తన ప్రవర్తన కారణంగా ముంబై రంజీ జట్టుకు దూరమైనట్లు స్పష్టమవుతోంది.
జట్టుకు చెందిన రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్‌కు అతను హాజరుకావడం లేదని ముంబై క్రికెట్ సంఘం అధికారి ఒకరు తెలిపారు. పృథ్వీ షా అధిక బరువు కూడా ఉన్నట్లు తెలుస్తోందన్నాడు. ఫీల్డింగ్‌లో అతని ఫిట్నెస్, రన్నింగ్ అంశాన్ని పరిశీలించాలని, ముంబై క్రికెట్ సంఘం అలాంటి ప్లేయర్లను ఎంకరేజ్ చేయదని ఆ అధికారి చెప్పారు.
రంజీ ట్రోఫీ తొలి రెండు రౌండ్ల మ్యాచుల్లో అతను 7, 12, 1, 39 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఫిట్నెస్, ప్రవర్తన ఆధారంగా అతన్ని జట్టు నుంచి తప్పించినట్లు ముంబై సీనియర్ మెన్స్ సెలెక్షన్ ప్యానల్ పేర్కొన్నది.