ఢిల్లీ: పలు ప్రతిష్ఠాత్మక క్రీడాటోర్నీల్లో దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన క్రీడాకారులకు సముచిత రీతిలో గౌరవం దక్కింది. పారిస్(2024) ఒలింపిక్స్‌లో పతకాలతో సత్తాచాటిన వారితో పాటు మెగాటోర్నీల్లో సత్తాచాటిన వారిని కేంద్ర క్రీడాశాఖ ఘనంగా సన్మానించింది. గతేడాదికి గాను కేంద్రం కొద్దిరోజుల క్రితం ప్రకటించిన క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది.
క్రీడారంగంలో అందజేసే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డును (ఈ ఏడాది నలుగురు క్రీడాకారులకు) స్టార్ షూటర్ మనూ భాకర్, చెస్ యువకెరటం దొమ్మరాజు గుకేశ్, హాకీ సారథి హర్మన్‌ప్రీత్ సింగ్, పారా హైంజపర్ ప్రవీణ్ కుమార్.. ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను స్వీకరించారు. తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీ, మరో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ అర్జున అవార్డులను అందుకున్నారు. అర్జున అవార్డు దక్కించుకున్న పలువురు పారా అథ్లెట్లు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.