హూస్టన్ : పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు లిఖించాడు. ప్రపంచకప్ చరిత్రలో ఆరు ఎడిషన్లలో గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మంగళవారం ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ఈ మైలురాయిని అందుకున్నాడు. క్రిస్టియానో డబుల్ గోల్స్‌తో సత్తా చాటడంతో గ్రూప్-కె పోరులో పోర్చుగల్ 5-0తో ఉజ్బెకిస్థాన్‌ను ఓడించి నాకౌట్ రేసులో నిలిచింది. కాంగోతో జరిగిన తొలి మ్యాచ్ పోర్చుగల్ 1-1తో డ్రా కావడం, ఆ మ్యాచ్‌లో గోల్ చేయలేకపోవడంపై వచ్చిన విమర్శలకు రొనాల్డో తన ఆటతోనే సమాధానమిచ్చాడు. ఆట మొదలైన 6వ నిమిషంలోనే జోవావో కాన్సెలో అందించిన క్రాస్‌ను అందుకుని 41 ఏండ్ల రొనాల్డో తన కుడి కాలితో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి పోర్చుగల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
ఆపై పోర్చుగల్ తన దాడిని మరింత ఉధృతం చేసింది. 17వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్ వద్ద రొనాల్డో తాను కిక్ కొట్టబోతున్నట్లు నటిస్తూ తెలివిగా బంతిని వదిలేయగా, అక్కడ సిద్ధంగా ఉన్న నునో మెండిస్ దాన్ని గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఆ తర్వాత 39వ నిమిషంలో మిడ్ ఫీల్డర్ బ్రూనో ఫెర్నాండెజ్ అందించిన పర్ఫెక్ట్ పాస్‌ను అందుకున్న రొనాల్డో.. వేగంగా దూసుకెళ్లి బాటమ్-లెఫ్ట్ కార్నర్‌లోకి బంతిని పంపి మ్యాచ్‌లో తన రెండో గోల్ నమోదు చేశాడు. 61వ నిమిషంలో పోర్చుగల్‌కు లభించిన కార్నర్ కిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నంలో ఉజ్బెకిస్థాన్ ఓన్ గోల్ చేయడంతో పోర్చుగల్ 4-0తో తిరుగులేని స్థితికి చేరింది. 87వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ రాఫెల్ లెయావో అద్భుతమైన గోల్ సాధించి పోర్చుగల్ భారీ విజయం ఖాయం చేశాడు.