Sachin Tendulkar | భారత మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు మద్దతుగా నిలిచాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన తర్వాత వినేశ్ అధిక బరువు కారణంగా అనర్హత వేటు విధించిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఓటమిపాలైనా సిల్వర్ మెడల్ వచ్చే అవకాశం ఉండేది. అయితే, మ్యాచ్‌కు ముందే 50 కిలోల బరువు ఉండాల్సి ఉండగా.. అదనంగా 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంతో వేటుపడింది. ఈ నిర్ణయంపై వినేశ్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. అనర్హత వేటు వేయడాన్ని సచిన్ విమర్శించారు. వినేశ్ పతకానికి అర్హురాలని పేర్కొన్నాడు. క్రీడల్లో నిబంధనలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించాడు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా వినేశ్‌కు మద్దతుగా ట్వీట్ చేశాడు.
ప్రతి క్రీడకు కొన్ని నియమాలు ఉంటాయని, ఆ నియమాలను సందర్భోచితంగా ఉండాలని చెప్పాడు. కొన్నిసార్లు వాటిని కూడా మళ్లీ చూడాల్సి ఉంటుందని.. వినేశ్ ఫోగట్ ఫైనల్‌కు అర్హత సాధించిందని.. బరువు ఆధారంగా అనర్హత ఫైనల్‌కు ముందు జరిగిందని తెలిపాడు. అయితే, సిల్వర్ మెడల్ ఇవ్వకపోవడం సరికాదన్నాడు. ఒక ఆటగాడు అనైతిక చర్యలకు పాల్పడితే వేటు వేయడం సమంజసమేనని.. కానీ వినేశ్ విషయంలో అలా జరగలేదని మాస్టర్ బ్లాస్టర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. డ్రగ్స్ వాడడం తదితర అనైతిక చర్యలకు పాల్పడడం అథ్లెట్‌ను అనర్హురాలిగా ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చునని తెలిపాడు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిందని.. ఆమె ఖచ్చితంగా రజత పతకానికి అర్హురాలని పేర్కొన్నారు. స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ నిర్ణయం కోసం తామంతా ఎదురుచూస్తున్నామని.. వినేశ్‌కి తగిన గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నానంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
#VineshPhogat #Paris2024 #Olympics @WeAreTeamIndia pic.twitter.com/LKL4mFlLQq
— Sachin Tendulkar (@sachin_rt) August 9, 2024