ODI World Cup | రోహిత్ సేన చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్.. నాలుగు మ్యాచ్‌ల తర్వాత తేరుకుంది. తమకంటే బలహీన ప్రత్యర్థి అయిన బంగ్లాదేశ్‌పై విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. బౌలర్లు సమిష్టిగా సత్తాచాటి బంగ్లా బ్యాటర్లను కట్టడి చేయగా.. ఓపెనర్లు రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని పాక్ వంద కంటే ఎక్కువ బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ గెలుపుతో పాక్ సెమీస్ రేసులో సజీవంగా ఉండటం పక్కన పెడితే.. ఆ జట్టుపై ఉన్న కొండంత ఒత్తిడిలో కాస్తంతైన తగ్గి ఉంటుందనడం వాస్తవం!
కోల్‌కతా: వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా చేతిలో ఓటమి తర్వాత లయ కోల్పోయిన పాక్.. నాలుగు ఓటముల అనంతరం ఎట్టకేలకు బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో బంగ్లాను మట్టికరిపించింది. మెగాటోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌కు ఇది మూడో విజయం కాగా.. ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు బంగ్లాదేశ్ ఏడు మ్యాచ్‌ల్లో ఆరో పరాజయం మూటగట్టుకొని నిరాశ పరిచింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహ్ముదుల్లా (56), లిటన్ దాస్ (45), కెప్టెన్ షకీబ్ (43) రాణించగా.. తన్జీద్ (0), నజ్ముల్ (4), ముష్ఫికర్ (5), తౌహిద్ (7) విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది, మహమ్మద్ వసీమ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 32.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫఖర్ జమాన్ (74 బంతుల్లో 81; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్లా షఫీఖ్ (68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ మూడు వికెట్లు తీశాడు. ఫఖర్ జమాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
ఇవన్నీ సాధ్య పడితే పాకిస్థాన్ 10 పాయింట్లతో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాత నాలుగో స్థానంతో నాకౌట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్: 45.1 ఓవర్లలో 204 ఆలౌట్ (మహ్ముదుల్లా 56, లిటన్ దాస్ 45; షాహీన్ 3/23, వసీమ్ 3/31), పాకిస్థాన్: 32.3 ఓవర్లలో 205/3 (ఫఖర్ 81, అబ్దుల్లా 68; మెహదీ 3/60). 1
1 వన్డేల్లో అత్యంత వేగంగా (51 మ్యాచ్‌ల్లో) 100 వికెట్లు తీసిన పేసర్‌గా షాహీన్ షా అఫ్రిది రికార్డుల్లోకెక్కాడు. మిషెల్ స్టార్క్ (52 మ్యాచ్‌ల్లో) రెండో స్థానానికి పరిమితమయ్యాడు.