PAK vs SA: వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిపోయి సెమీస్ రేసు నుంచి తప్పుకునేందుకు పాకిస్తాన్ తహతహలాడుతున్నట్టుంది. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో మిడిలార్డర్లో రాణించడంతో సఫారీల ఎదుట 271 పరుగుల లక్ష్యాన్ని నిలిపిన పాకిస్తాన్.. స్పిన్‌కు అనుకూలించే చెపాక్ పిచ్‌పై సఫారీలను కట్టడి చేయడంలో విఫలమవుతున్నది. ధాటగా ఆడుతున్న దక్షిణాఫ్రికా.. విజయానికి దగ్గరగా సెమీస్ రేసుకు మరింత చేరువ అవుతున్నది.
271 పరుగుల ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సౌతాఫ్రికాకు షషీన్ అఫ్రిది తొలి షాకిచ్చాడు. తాను వేసిన రెండో ఓవర్లో వరుసగా నాలుగు బౌండరీలు బాదిన ఓపెనర్ క్వింటన్ డికాక్ (14 బంతుల్లో 24, 5 ఫోర్లు) ను నాలుగో ఓవర్లో ఔట్ చేశాడు. డికాక్ నిష్క్రమించాక నవాజ్ వేసిన ఆరో ఓవర్లో టెంబ బవుమా (27 బంతుల్లో 28, 4 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా మూడు బౌండరీలు కొట్టాడు. దీంతో సఫారీ స్కోరు రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. హరీస్ రౌఫ్ వేసిన 9వ ఓవర్లో మూడో బంతికి భారీ సిక్సర్ బాదిన బవుమా మహ్మద్ వసీం జూనియర్ వేసిన పదో ఓవర్లో ఐదో బంతికి సౌద్ షకీల్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఓపెనర్లు నిష్క్రమించాక వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డెర్ డసెన్ (21)లు మూడో వికెట్‌కు 54 బంతుల్లో 54 పరుగులు జోడించి సౌతాఫ్రికాను విజయం దిశగా నడిపించారు. అయితే ఎట్టకేలకు డసెన్‌ను ఉసామా మీర్ 19వ ఓవర్లో ఎల్బీ రూపంలో వెనక్కి పంపాడు. దీంతో సఫారీలు మూడో వికెట్ కోల్పోయారు. 21 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ సౌతాఫ్రికా.. 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి విజయం దిశగా దూసుకుపోతుంది. ఎయిడెన్ మార్క్రమ్ (42 నాటౌట్) తో పాటు హెన్రిచ్ క్లాసెన్ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సఫారీలు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ను వెనక్కినెట్టి మొదటి స్థానం కైవసం చేసుకుంటారు.