హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11: మపుసా(గోవా)లోని స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన 24వ ఎఫ్ఎస్కేఏ ప్రపంచకప్ కరాటే చాంపియన్షిప్ ఓరుగల్లు కుర్రాళ్లు పతక జోరు కనబరిచారు. ఈ నెల 10 వరకు జరిగిన టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా 36 దేశాలకు చెందిన 125 మంది ప్లేయర్లు పోటీపడ్డారు. వివిధ బరువు విభాగాల్లో భారత్కు 124 స్వర్ణాలు, 218 రజతాలు, 256 కాంస్య పతకాలు దక్కాయి. హనుమకొండలోని చాంపియన్స్ కరాటే అకాడమీ ప్లేయర్లు పొన్న యశ్వంత్..కుమిటేలో స్వర్ణం, కటాలో రజతంతో మెరిశాడు. ఆదిత్య(రజత, కాంస్యం), రెడ్డబోయిన భరత్..కుమిటేలో స్వర్ణం, కాటాలో కాంస్యం సొంతం చేసుకున్నాడు. పతక ప్రదాన కార్యక్రమంలో కరాటే వ్యవస్థాపకుడు జపాన్లోని ఓకినోవా నుంచి కెవిన్ ఫునకోషి, డబ్ల్యూఎఫ్ఎస్కేవో ఇండియా ప్రెసిడెంట్ హసన్ ఇస్మాయిల్, ఎంఎంఏ ఫైటర్ బ్రియాన్ బెర్నార్డ్, హీరో సుమన్ తల్వార్, గోవా క్రీడా మంత్రి గోవింద్గౌడ్ పాల్గొన్నారు.