25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. కుడి మోకాలి గాయం కారణంగా నొవాక్ ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు ఫ్రెంచ్ ఓపెన్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్నివారాలుగా మోకాలి నొప్పి వేధిస్తున్నా తగు జాగ్రత్తలతో ఈ టోర్నీ బరిలోకి దిగిన సెర్బియా స్టార్.. రెండ్రోజుల క్రితం ఫ్రాన్సిస్కొ సెరున్డొలొపై సుమారు నాలుగున్నర గంటల పాటు జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో పలుమార్లు గాయంతో ఇబ్బందిపడ్డాడు. మ్యాచ్ ముగిశాక జొకోకు నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్‌లో గాయం తీవ్రత ఎక్కువుండటంతో అతడు టోర్నీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో క్వార్టర్స్‌లో అతడితో తలపడాల్సిన కాస్పర్ రూడ్.. సెమీస్ చేరాడు.