‘ఓటమే విజయానికి పునాది’ అంటారు. అవును మరోమారు అక్షరాల నిజమైంది. ఎక్కడైతే పొగోట్టుకున్నామో అక్కడే దక్కించుకోవడంలో ఉన్న మజా అంతాఇంతా కాదు. సరిగ్గా మూడేండ్ల క్రితం ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌తో సై అంటే సై అని తెలంగాణ తెగువ చూపించిన నిఖత్ జరీన్ వరుసగా రెండో సారి ప్రపంచ బాక్సింగ్ విజేతగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం పారదర్శకమైన ట్రయల్స్ నిర్వహించండంటూ అప్పటి కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాసి దేశం దృష్టిని ఆకర్షించిన ఇందూరు ముద్దుబిడ్డ నిఖత్ తన సత్తాఏంటో మరోమారు ప్రపంచానికి చూపెట్టింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్‌తో ఢీ అంటే ఢీ అన్న నిఖత్ వరుసగా రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచి ఔరా అనిపించింది. సొంతగడ్డపై అభిమానుల మద్దతు మధ్య బెబ్బులిలా ప్రత్యర్థులపై విరుచుకుపడింది.
2021 అక్టోబర్ నుంచి తనకు తిరుగులేదన్న రీతిలో నిఖత్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో ఈ తెలంగాణ యువ బాక్సర్ సంధిస్తున్న పంచ్‌లకు దిమ్మతిరగని బాక్సర్ లేరంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే 2021 నుంచి బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో జరీన్ విజయదుందుభి మోగిస్తున్నది. వరుసగా జాతీయ చాంపియన్‌షిప్ టైటిళ్లు, ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక టోర్నీలో పసిడి పతకం, టర్కీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, అదే జోరుతో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి. ఇలా టోర్నీ ఏదైనా పసిడి పతకం పక్కా అన్న రీతిలో నిఖత్ విజృంభిస్తున్నది.
ఈ క్రమంలో ప్రత్యర్థులకు కనీసం ఒక బౌట్ కూడా చేజార్చుకోకపోవడం గమనార్హం. తన అద్భుత ప్రతిభతో మేరీకోమ్‌కు సవాలు విసిరి తెలంగాణ తెగువ చూపించిన నిఖత్.. భారత బాక్సింగ్ క్వీన్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనుక ఆమె కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, వారి త్యాగం, కోచ్‌ల శిక్షణ నిఖత్‌ను ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా మలిచాయి.
ప్రతిష్ఠాత్మక పారిస్(2024) ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా నిఖత్ ముందుకెళుతున్నది. తన చిరకాల కలను సాకారం చేసుకునే క్రమంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52కిలోల విభాగంలో విజేతగా నిలిచిన జరీన్ ఈసారి 50 కిలోల కేటగిరీకి మారింది. పారిస్ ఒలింపిక్స్ వెయిట్ కేటగిరీలను దృష్టిలో పెట్టుకుని తన విభాగాన్ని మార్చుకున్న నిఖత్ మరింత మెరుగైన ప్రదర్శన కోసం తన శరీర బరువును 3 నుంచి 4 కిలోల వరకు తగ్గించుకోవాల్సి వచ్చింది.
ఈసారి మెగాటోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన నిఖత్ జరీన్ లక్ష్యసాధన కోసం అలుపెరుగకుండా పోరాడింది. బౌట్ బౌట్‌కు తన పంచ్‌లో వాడివేడిని చూపిస్తూ ముందంజ వేసింది. సహచర బాక్సర్లకు బై లభించిన చోట నిఖత్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకంగా ఆరు బౌట్లలో తలపడింది. ఇందులో వరుసగా మూడు రోజుల్లో తన కంటే మెరుగైన సీడ్లో ఉన్న బాక్సర్లను మట్టికరిపించి మెండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. ఓవైపు ప్రత్యర్థులపై పదునైన పంచ్‌లు విసురుతూ వారు విసిరే పంచ్‌లను కాచుకుంటూ ఒంటిపై గాయాలు బాధిస్తున్నా..పంటిబిగువున భరిస్తూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది.
– నమస్తే తెలంగాణ క్రీడావిభాగం