మెక్సికో: కాళ్లమీద నిలబడాలంటేనే మనకు నీరసం వస్తుంది. అలాంటిది ఒంటిచేతిపై నిలబడడమంటే తలప్రాణం తోకకు వచ్చినట్టే. కానీ దానిని సునాయాసంగా ప్రదర్శించి మెక్సికోకు చెందిన నికొలాస్ మాంటెస్ డి ఒకా హ్యాండ్ స్టాండ్ విన్యాసంలో రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నాడు.
ఒంటి చేతిపై నిశ్చలంగా ఒక నిమిషం 11.82 సెకండ్లపాటు నిలబడి ఒక రికార్డును, గుండ్రంగా తిరిగే వేదికపై 25.78 సెకండ్లపాటు నిలబడి మరో రికార్డును నికొలాస్ తన పేరిట లిఖించుకున్నాడు. 16 ఏళ్ల వయసులో ఒక గారడీవాడిని చూసి ఆ విన్యాసాలపై ఆసక్తి పెంచుకున్న నికొలాస్ ఒంటిచేతిపై నిలబడడం సాధన చేసి నేడు గిన్నిస్ రికార్డులను నెలకొల్పాడు. దీనికోసం రోజుకు రెండు మూడు గంటలు సాధన చేసేవాడినని, ఇందుకు ఎంతో క్రమశిక్షణ, నేర్పు అవసరమని నికొలాస్ అన్నాడు.