హోరాహోరీ పోరాటాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న టీ20 ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. అనూహ్య ఫలితాలతో గ్రూప్ దశ ముగియగా.. బుధవారం తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. గ్రూప్-1లో టాపర్‌గా నిలిచిన న్యూజిలాండ్ నేరుగా సెమీస్‌కు అర్హత సాధించగా.. అనుకోని అవకాశంతో పాకిస్థాన్ గ్రూప్-2 నుంచి సెమీస్‌లో అడుగుపెట్టింది. మరి ఇరు జట్లలో ఫైనల్ చేరేదెవరో చూసేందుకు మీరూ సిద్ధమైపోండి!
సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నీల్లో నిలకడకు మారుపేరైన న్యూజిలాం డ్.. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్-1లో మొత్తం నాలుగు మ్యాచ్‌లాడిన న్యూజిలాండ్ మూడింట నెగ్గి ఒక దాంట్లో ఓటమి పాలైంది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రైద్దెంది. ఫలితంగా 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న న్యూజిలాండ్ అగ్రస్థానంతో అందరికంటే ముందే సెమీస్ బెర్త్ ఖారారు చేసుకోగా.. గ్రూప్-2 నుంచి చివరి నిమిషంలో పాకిస్థాన్ దూసుకొచ్చింది. భారత్, జింబాబ్వేతో మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన పాకిస్థాన్ ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు మూడుసార్లు ప్రపంచకప్ సెమీఫైనల్స్ జరుగగా.. మూడింట్లోనూ పాకిస్థాన్నే విజయం వరించింది. సమష్టితత్వానికి పెట్టింది పేరైన న్యూజిలాండ్ గత ఏడేండ్లలో మూడు ప్రపంచకప్ ఫైనల్స్ (2015, 2019 వన్డే, 2021 టీ20)లో ఓడింది.
ఆల్‌రౌండ్ బలంగా..
కాన్వే, అలెన్, విలియమ్సన్, ఫిలిప్స్, మిషెల్, నీషమ్ రూపంలో న్యూజిలాండ్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ అందుబాటులో ఉంది. ఫిలిప్స్, కాన్వే ఫుల్‌ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుంది. గత కొంతకాలంగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఫామ్‌లోకి రావడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ డెప్త్ మరింత పెరిగింది. ప్రపంచకప్ సూపర్-12 ఆరంభ పోరులో ఆస్ట్రేలియాపై భారీ స్కోరు చేసిన న్యూజిలాండ్ మరోసారి అక్కడే మ్యాచ్ ఆడనుంది. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, ఫెర్గూసన్ రూపంలో ముగ్గురు ప్రపంచస్థాయి పేసర్లతో పాక్ టాపార్డర్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా అపార అనుభవం ఉన్న సౌథీ, బౌల్ట్‌ను కాచుకోకుంటే పాక్ పనైపోయినట్లే. శాంట్నర్, సోధి స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. నిరుడు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పరాజయం పాలైన న్యూజిలాండ్.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది.
బౌలర్ల అండతో..
పేస్ బౌలింగ్‌కు పెట్టింది పేరైన పాకిస్థాన్.. మరోమారు అదే బలంగా బరిలోకి దిగుతున్నది. షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవుఫ్, నసీమ్ షా రూపంలో ముగ్గురు మొనగాళ్లు.. ఎంతటి బ్యాటింగ్ లైనప్‌నైనా కకావికలం చేయగల సమర్థులే. వారికి స్పిన్నర్ల సహకారం తోడవడంతో పాకిస్థాన్ ఇటీవలి కాలంలో విజయాలు సాధించగలుగుతున్నది. అయితే బ్యాటింగ్‌లో నిలకడలేమి పాక్‌ను ఇబ్బందిపెడుతున్నది. కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. వీరిద్దరు కలిసికట్టుగా కదంతొక్కాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. మిడిలార్డర్లో షాన్ మసూద్, ఇఫ్తిఖార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్ మంచి టచ్‌లో ఉన్నారు. అయితే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై వీరంతా సమష్టిగా రాణిస్తేనే పాక్ ఆశించిన స్కోరు చేయగలుగుతుంది. మరి బ్యాటింగ్‌కు అనుకూలించనున్న పిచ్‌పై ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
పిచ్, వాతావరణం
ఈ మెగాటోర్నీలో ఇక్కడ జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. సూపర్-12లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగిన వికెట్‌పైనే బుధవారం పోరు సాగనుంది. కుదురుకుంటే బ్యాటింగ్ చేయడం సులువే. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.