హనుమకొండ, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాత వాటికి కొత్త పేర్లు పెట్టి గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఇలాగే చేస్తున్నది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా వరంగల్ నగరంలో స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని మంజూరు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలోని 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నది. ప్రకటనలో హంగామా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఎప్పటిలాగే వ్యవహరిస్తున్నది. 40 ఏండ్ల క్రితం ఏర్పాటైన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లోనే స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార పార్టీ కీలక ప్రజాప్రతినిధులు ప్రకటించారు. హడావుడిగా ఆగస్టు 15న స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జేఎన్ఎస్ లోని భవనాలు, క్రీడాకారుల హాస్టళ్లు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి మరమ్మతులకూ నోచుకోక విద్యార్థులు ఉండేందుకు అనువుగా లేవు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే కొత్త స్కూల్‌ను ఏర్పాటు చేయనుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, ఆచరణకు పొంతన కుదరడం లేదని సీనియర్ క్రీడాకారులు చెబుతున్నారు. కొత్తగా మంజూరువుతున్న స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని అన్ని ఆటల శిక్షణ, పోటీల నిర్వహణకు అనుగుణంగా ఉండే విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.
హనుమకొండ బస్టాండ్‌కు ఎదురుగా 16 ఎకరాల్లో 1985లో జేఎన్‌ఎస్‌ను నిర్మించారు. జేఎన్ఎస్లో కనీసం వాకింగ్ ట్రాక్ కూడా సరిగ్గా లేదు. హాస్టల్ భవనాలు, ఇండోర్, ఔట్‌డోర్ క్రీడా మైదానాల పరిస్థితి దయనీయంగా ఉన్నది. క్రీడాకారులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, కుర్చీలు, హాస్టల్ బెడ్స్, బెంచీలు, స్పోర్ట్స్ మెటీరియల్ సైతం ఇక్కడ లేదు. జేఎన్ఎస్ పాత నిర్మాణం కావడంతో స్టేడియం భవనాలు పెచ్చులూడి, పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక్కడే ఉన్న రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ భవనం సైతం శిథిలావస్థకు చేరింది. విద్యార్థులకు ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చనే ఆందోళనతో హాస్టల్‌ను పక్కనే ఉన్న మరో భవనంలోకి మార్చారు. రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రస్తుతం 96 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 70 మంది బాలురు, 26 మంది బాలికలు. కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఇప్పుడు హాస్టల్లో ఉంటున్న వారికి అదనంగా మరో 80 మంది విద్యార్థులు రానున్నారు. హాస్టల్ వద్ద స్థలం లేకపోవడంతో బట్టలు బయటనే ఆరబెట్టాల్సిన వైనం అక్కడ నెలకొంది. హాస్టల్ భవనంలోని తలుపులు, బాత్రూం డోర్లు రంద్రాలు పడి విరిగిపోయాయి. జేఎన్ఎస్ ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిచెట్లతో పాములు, తేళ్లతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ కనీస మరమ్మతు పనులు చేపట్టేందుకు గాను ఇటీవలే రూ.80 లక్షలతో ప్రణాళికను రూపొందించారు. ఆటల శిక్షణకు, పోటీల నిర్వహణకు ఎలాంటి వసతులూ లేని జేఎన్‌ఎస్‌ను అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ స్కూల్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా… స్పోర్ట్స్ స్కూల్‌కు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, నిధులు మంజూరు కాలేదు.
యువ క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ, ప్రమోజిత మౌలిక సదుపాయాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశం కల్పించడమే లక్ష్యంగా స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉండాలి. అన్ని రకాల ఆటలకు కోచ్‌లు, గ్రౌండ్లు, కోర్టులు, వసతులు ఉండాలి. కానీ ప్రస్తుతం జేఎన్ఎస్లో ఇవేమీ లేవు. క్రీడాభివృద్ధి సంస్థ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో 11 క్రీడాంశాల్లో ఇప్పుడు శిక్షణ ఇస్తున్నారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్ (బాయ్స్, గర్ల్స్), రెజ్లింగ్, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, లాన్‌టెన్నిస్, ఖోఖో, వాలీబాల్ ఉన్నాయి. దాదాపు అన్నింటికీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే కోచ్‌లున్నారు. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి ఆటలు ఆడే క్రీడాకారులకు ఆ సౌకర్యం కూడా లేదు.
జేఎన్ఎస్లో ఆటల నిర్వహణకు అవసరమైన ట్రాక్‌ను, ఇతర వసతులను బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 కోట్లతో పూర్తి చేసింది. ఫెన్సింగ్, ప్రహారీ, గార్డెనింగ్, డ్రైనేజీతోపాటు కొత్త గేటునూ అమర్చారు. రూ.7.80 కోట్లతో ఈ స్టేడియంలో సింథటిక్ ట్రాక్‌ను నిర్మించారు. 400 మీటర్ల చొప్పున 8 లైన్లు… 100 మీటర్ల చొప్పున 10 లైన్లతో ట్రాక్ మధ్యలో 22 క్రీడల నిర్వహణకు అనువుగా సింథటిక్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. మట్టి ట్రాక్‌పై క్రీడాకారుల అసలైన ప్రతిభ పూర్తి స్థాయిలో వెల్లడికాదు. సింథటిక్ ట్రాక్‌తో క్రీడాకారుల అసలైన సామర్థ్యం తెలుస్తుంది. గాయాలకు అస్కారం ఉండదు. వానలు పడినా పోటీల నిర్వహణకు ఆటంకాలు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ట్రాక్‌ను చూపించే స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.