వన్డే ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిస్తే.. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై అంతకుమించిన ఫలితంతో నెదర్లాండ్స్ ప్రపంచకప్‌ను కుదిపేసింది!
వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు కేవలం రెండంటే రెండే మ్యాచ్‌లు నెగ్గిన ఓ చిన్న జట్టు.. ఇటీవలే మెగాటోర్నీలో అత్యధిక స్కోరు రికార్డు బద్దలు కొట్టిన టీమ్‌ను మట్టికరిపిస్తుందని ఊహించారా! హిమాలయ పర్వత సానువుల్లో డచ్ జట్టు దీన్ని చేసి చూపెట్టింది!!
అంచనాలకు అందకుండా సాగిన పోరులో దక్షిణాఫ్రికా పేస్ దాడిని తట్టుకుంటూ మంచి స్కోరు చేసిన నెదర్లాండ్స్.. ఆ తర్వాత అద్భుత బౌలింగ్‌తో సఫారీలకు చెక్ పెట్టింది. సప్త సముద్రాలు ఈదిన వాడు పిల్ల కాలువలో పడ్డట్లు.. సునాయాస లక్ష్యఛేదనలో ప్రొటీస్ బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు!!!
ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో అతిపెద్ద సంచలనం నమోదైంది. రెండు రోజుల క్రితమే ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌పై అఫ్గానిస్థాన్ విజయం సాధించగా.. మంగళవారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆస్ట్రేలియాపై చక్కటి విజయాలతో సెమీఫైనల్ రేసులో ముందంజలో నిలిచిన దక్షిణాఫ్రికా.. చిన్న జట్టు చేతిలో ఓటమితో ఒక్కసారిగా చతికిలబడింది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభం కాగా.. ఆటను 43 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే హాఫ్‌సెంచరీ నమోదు చేయగా.. తొమ్మిదో, పదో స్థానాల్లో బరిలోకి దిగిన వాన్ డెర్ మెర్వ్ (29; 3 ఫోర్లు, ఒక సిక్సర్), ఆర్యాన్ దత్ (9 బంతుల్లో 23; నాటౌట్; 3 సిక్సర్లు) వజ్రాలకన్నా విలువైన పరుగులు రాబట్టారు. సఫారీ బౌలర్లలో ఎంగ్డీ, రబడ, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (43; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కేశవ్ మహారాజ్ (40; 5 ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా ఫలితం లేకపోయింది. మార్క్మ్ (1), డసెన్ (4), డికాక్ (20), బవుమా (16), క్లాసెన్ (28), జాన్సెన్ (9) ఒకరి వెంట ఒకరు పెవిలియన్ క్యూ కట్టారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్ 3, వాన్ డెర్ మెర్వ్, బాస్ డీ లీడ్, మీకిరన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. నిరుడు టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన నెదర్లాండ్స్.. ఇప్పుడు వన్డే వరల్డ్‌కప్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది. ఎడ్వర్డ్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌కు ఇది మూడో విజయం. పెద్ద జట్ల పరంగా చూసుకుంటే ఇదే మొదటిది.
మెగాటోర్నీలో దక్షిణాఫ్రికాను ఓడించడం నెదర్లాండ్స్‌కు ఇది రెండో సారి. నిరుడు టీ20 ప్రపంచకప్‌లోనూ డచ్ జట్టు సఫారీలను మట్టికరిపించింది.
నెదర్లాండ్స్: 43 ఓవర్లలో 245/8 (ఎడ్వర్డ్స్ 78 నాటౌట్; వాన్ డెర్ మెర్వ్ 29; జాన్సజెన్ 2/27, రబడ 2/56), దక్షిణాఫ్రికా: 42.5 ఓవర్లలో 207 ఆలౌట్ (మిల్లర్ 43, కేశవ్ 40; వాన్ బీక్ 3/60, వాన్ డెర్ మెర్వ్ 2/34).