జ్యురిచ్: ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ టోర్నీలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్..డైమండ్ లీగ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి మొదలైన పురుషుల జావెలిన్‌త్రో మొదటి ప్రయత్నంలో నీరజ్ బరిసెను 80.79మీటర్ల దూరం విసిరి ఆకట్టుకున్నాడు. ఈ విభాగంలో పోటీపడుతున్న జాకబ్ వాల్దిచ్ తప్పిదం చేయగా, మాజీ ప్రపంచ చాంపియన్న అండర్సన్ పీటర్స్ 78.78మీటర్లకు పరిమితమయ్యాడు వెబర్ తన తొలి ప్రయత్నంలోనే ఫౌల్‌గా వెనుదిరిగాడు.
దీంతో నీరజ్ దరిదాపుల్లో ఎవరూ రాలేకపోయారు. అయితే రెండో రౌండ్లో నీరజ్ ఫౌల్ చేశాడు. వాల్దిచ్ 83.46మీటర్ల దూరంతో ఆధిక్యం కనబర్చగా..వెబర్ ఏకంగా 84.75మీటర్లతో టాప్‌లోకి దూసుకొచ్చాడు. రెండో రౌండ్ ముగిసే సరికి నీరజ్ ఐదో స్థానంలో నిలిచాడు. మూడోరౌండ్‌లోనూ నీరజ్ మరోమారు ఫౌల్‌తో నిరాశపరిచాడు. నాలుగో రౌండ్లో 85.22 మీటర్లు విసిరాడు. మరోవైపు పురుషుల లాంగ్‌జంప్‌లో భారత యువ అథ్లెట్ శ్రీశంకర్ తన తొలి ప్రయత్నంలో 7.99మీటర్లు లంఘించి దూకాడు. అయితే రెండో రౌండ్లో 7.96మీటర్లు దూకిన శంకర్..మూడో రౌండ్ పూర్తయ్యే సరికి రెండులో ఉన్నాడు. నాలుగో రౌండ్లో ఈ యువ అథ్లెట్ 7.96మీటర్ల దూరంతో ఆకట్టుకోగా, ఐదో రౌండ్లో 7.93మీటర్లకు పరిమితమయ్యాడు.