Navenn Ul Haq : అఫ్గనిస్థాన్ స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్(Navenn Ul Haq) వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వరల్డ్ కప్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) చేతిలో ఓటమి అనంతరం నవీన్ సోషల్‌మీడియా వేదికగా తన నిర్ణయం ప్రకటించాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ వన్డే ప్రపంచ కప్‌తో వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నా.
ఇకనుంచి టీ20ల్లో మాత్రమే కొనసాగుతా. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు, అభిమానులకు ధన్యవాదాలు’ అని నవీన్ వెల్లడించాడు.
నవీన్ ఉల్ హక్ 2016లో అఫ్గన్ తరఫున తొలి వన్డే ఆడాడు. ఇప్పటివరకూ 15 వన్డేలు మాత్రమే ఆడిన 22 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్ అద్భుతంగా రాణిస్తున్న ఈ కుడిచేతివాటం పేసర్.. 27 మ్యాచుల్లో 34 వికెట్లు తీశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన నవీన్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో వివాదంతో వార్తల్లో నిలిచాడు.
నవీన్ ఉల్ హక్, కోహ్లీ
అప్పటినుంచి అతడు ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అంటూ అతడిని ఆటపట్టించడం తెలిసిందే. అయితే.. వరల్డ్ కప్‌లో అఫ్గనిస్థాన్, భారత్ మ్యాచ్‌లో కోహ్లీ, నవీన్ ఒకరినొకరు పలకరించుకొని వివాదానికి తెరదించారు. మెగా టోర్నీలో మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్‌కు ఝలకు ఇచ్చిన అఫ్గన్ జట్టు . చివరి లీగ్‌మ్యాచ్‌లో సఫారీల చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కెరీర్ ఆఖరి వన్డేలో నవీన్ వికెట్ తీయలేకపోయాడు. అతడు 6.3 ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చాడు.