సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ.. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి పోటీపడబోతున్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగుస్తున్నది. మరోమారు కోచ్గా ఉండేందుకు రవిశాస్త్రి అసక్తత కనబరుస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం అన్వేషిస్తున్నది. ఈ క్రమంలో గతంలో మూడుసార్లు దరఖాస్తు చేసుకున్న టామ్ మూడీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. నాలుగో ప్రయత్నంలోనైనా సఫలం కావాలన్న పట్టుదలతో ఉన్న ఈ 56 ఏండ్ల ఆసీస్ మాజీ ఆల్రౌండర్..కోచ్ పదవి కోసం దరఖాస్తు చేయనున్నట్లు ఫాక్స్స్పోర్ట్స్ వార్తాసంస్థ పేర్కొంది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, శ్రీలంక జట్టుకు మూడీ ప్రస్తుతం డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. కోచ్గా సుదీర్ఘ అనుభవమున్న మూడీ వైపు బీసీసీఐ మొగ్గుచూపుతుందా లేక మళ్లీ స్వదేశీ కోచ్కే అవకాశమిస్తుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.