సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో అంతర్జాతీయ సైక్లింగ్ పోటీలు నిర్వహించే ఆలోచన ఉందని, దానికి అనుగుణంగా నగరంలో మరిన్ని ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో సైకిల్ ట్రాక్‌లను నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ఐటీ కారిడార్‌లోని ఔటర్ రింగు రోడ్డు వెంబడి 23 కిలోమీటర్ల మేర నిర్మించిన దేశంలోనే మొట్ట మొదటి సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలో దక్షిణ కొరియా తర్వాత హైదరాబాద్‌లో రెండవ సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్ ఉందని, ఇలాంటివి ఇప్పుడు దుబాయ్, స్విట్జర్లాండ్‌లో కూడా నిర్మాణంలో ఉన్నాయన్నారు.
హైదరాబాద్‌లో ఉన్న సైక్లిస్టులను చూస్తుంటే చాలా ఉత్సాహాంగా ఉందని, అలాంటి వారిని ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ఓఆర్ఆర్ వెంబడి నిర్మించిన 23 కి.మీ మార్గమే కాకుండా త్వరలోనే ఫైనాన్సియల్ డిస్ట్రిక్, కోకాపేట నియోపోలిస్ లేఅవుట్, బుద్వేల్ లేఅవుట్లలోనూ ప్రత్యేకంగా ఎలాంటి అడ్డంకులు లేని సైకిల్ ట్రాక్‌లను నిర్మిస్తామన్నారు. అదేవిధంగా జంట జలాశయాల్లో ఒకటైన గండిపేట చుట్టూ 46 కి.మీ మేర సైకిల్ ట్రాక్‌ను నిర్మించడం నా కల అని, దాన్ని సైతం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో ముఖ్యమన్నారు. ఓఆర్ఆర్ వెంబడి చేపట్టిన సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్ ప్రాజెక్టు ద్వారా 16 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా చేపట్టామని సోలార్ ప్యానెల్స్‌పై పెట్టిన పెట్టుబడి 6 ఏళ్లలో తిరిగి వస్తుందని, సైకిల్ ట్రాక్‌పై పెట్టిన పెట్టుబడి 14-15 ఏళ్లలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, హైదరాబాద్ సైక్లింగ్ గ్రూపు ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.