గ్వాడలజారా (మెక్సికో): ఫిఫా ప్రపంచకప్ లో ఆతిథ్య మెక్సికో అదరగొట్టింది. గ్రూప్-ఎ లో వరుసగా రెండో విజయంతో మెగా టోర్నమెంట్లో నాకౌట్ (రౌండ్-32) దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్రేక్షకులతో కిక్కిరిసిన ఎస్టాడియో అక్రాన్ స్టేడియంలో శుక్రవారం హోరాహోరీగా జరిగిన గ్రూప్-ఎ పోరులో మెక్సికో 1-0 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. ఆట మధ్యలో కొరియా డిఫెన్స్ యూనిట్ చేసిన ఘోర తప్పిదాన్ని అనుకూలంగా మార్చుకున్న మెక్సికో గోల్ కొట్టి ముందంజ వేసింది. గత ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన మెక్సికో.. ఈసారి స్వదేశంలో నాకౌట్ చేరి అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. ఈ గెలుపుతో మెక్సికో 6 పాయింట్లతో గ్రూప్-ఎ లో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే గ్రూప్‌లో చెక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మరో మ్యాచ్ 1-1తో డ్రాగా అయింది.
ఈ మ్యాచ్ ఫస్టాఫ్ ఎలాంటి గోల్స్ లేకుండా చప్పగా సాగింది. అయితే రెండో సగం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆట మలుపు తిరిగింది. 50వ నిమిషంలో దక్షిణ కొరియా గోల్‌కీపర్ కిమ్ స్యుంగ్ జు, డిఫెండర్ లీ గియుక్ ఒకరినొకరు ఢీకొనడంతో బంతి చేజారింది. అక్కడే సిద్ధంగా ఉన్న మెక్సికో మిడ్‌ఫీల్డర్ లూయిస్ రోమో ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాల్‌ను ఖాళీ గోల్ పోస్ట్‌లోకి పంపి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 75వ నిమిషంలో మెక్సికో రెండో గోల్ సాధించేందుకు చాలా చేరువగా వచ్చింది. ఆ జట్టు ఆటగాడు రావుల్ జిమెనెజ్ కొట్టిన షాట్‌ను కొరియా కీపర్ కిమ్ అడ్డుకున్నాడు. మరోవైపు స్కోరు సమం చేసేందుకు కొరియన్లు చాలా ప్రయత్నాలు చేశారు. ఆట చివర్లో దాడుల్లో వేగం పెంచారు. 87వ నిమిషంలో గోల్ చేసే సువర్ణావకాశాన్ని కోల్పోయింది.
కొరియా ప్లేయర్ చో గుయ్-సంగ్ హెడర్ ద్వారా కొట్టిన క్లోజ్-రేంజ్ షాట్‌ను మెక్సికో గోల్‌కీపర్ రావుల్ రాంజెల్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఆ వెంటనే రీబౌ్ండ అయిన బంతిని యాంగ్ హ్యున్-జున్ మళ్లీ గోల్ కొట్టేందుకు ప్రయత్నించగా, రాంజెల్ తన కుడి చేతిని చాచి బాల్ లైన్ దాటకుండా ఆపాడు. మరోవైపు దక్షిణ కొరియా భారీ అంచనాలు పెట్టుకున్న స్టార్ ఆటగాడు, లాస్ ఏంజిల్స్ ఎఫ్‌సీ ఫార్వర్డ్ సన్ హ్యుంగ్-మిన్ ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ప్రపంచకప్‌లో కొరియా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన 33 ఏండ్ల సన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో 57వ నిమిషంలోనే కోచ్ అతడిని వెనక్కి పిలిచాడు.
గ్రూప్-బి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 4-1తో బోస్నియా-హెర్జెగోవినాపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ 73వ నిమిషం వరకు ఇరు జట్లు 0-0తో సమంగా ఉన్నప్పటికీ, ఆఖరి 20 నిమిషాల్లో స్విస్ జట్టు వరుస గోల్స్‌తో విరుచుకుపడింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన 20 ఏండ్ల యువ ప్లేయర్ జోహన్ మంజంబి (74, 90వ నిమిషాల్లో) రెండు సూపర్ గోల్స్‌తో మెరిశాడు. రూబెన్ వర్గాస్ (84వ నిమిషం) ఓ గోల్ కొట్టగా.. ఇంజ్యూరి టైమ్‌లో లభించిన పెనాల్టీని కెప్టెన్ గ్రానిట్ జాకా (90+7వ నిమిషం) పెనాల్టీ) గోల్‌గా మలిచి జట్టుకు భారీ విజయం అందించాడు. బోస్నియా తరఫున ఎర్మిన్ (90+3వ ని) ఆఖర్లో ఏకైక గోల్ చేశాడు.
వాంకోవర్: ప్రపంచకప్ చరిత్రలో కెనడా తొలి విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన గ్రూప్-బి పోరులో కెనడా 6-0 గోల్స్ తేడాతో ఖతార్‌ను చిత్తుగా ఓడించింది. కెనడా స్టార్ స్ట్రైకర్ జొనాథన్ డేవిడ్(29, 45+1, 90+2వ నిమిషాల్లో) హాట్రిక్ గోల్స్‌తో చెలరేగాడు. ఈ ప్రపంచకప్‌లో లియోనల్ మెస్సీ తర్వాత హాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా డేవిడ్ నిలిచాడు. ఖతార్ ఆటగాళ్లు హోమన్ అహ్మద్ (33వ నిమిషం), అసిమ్ మదిబో (53వ నిమిషం) ప్రమాదకరమైన ఫౌల్స్ కారణంగా రెడ్ కార్డులకు గురై బయటికి వెళ్లడంతో ఆ జట్టు 9 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. మరోవైపు కెనడా బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని పూర్తిగా ఎటాకింగ్ గేమ్ ఆడింది. టార్గెట్ పై పది సార్లు సహా మొత్తంగా 31 సార్లు దాడులు చేసింది. కెనడా తరఫున సైల్ లారిన్ (16వ నిమిషం), నేథన్ సలిబా (64వ నిమిషం) కూడా చెరో గోల్‌తో జట్టు విజయంలో భాగం అయ్యారు. ఖతా ర్ పూర్తిగా తేలిపోయింది. మొహమ్మద్ మనాయ్ (75వ నిమిషం) సెల్ఫ్ గోల్ చేయడంతో ఖతార్ ఘోర ఓటమి చవి చూసింది.